ప్రజాశక్తి- దత్తి రాజేరు: వైసిపి అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజలూ ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ అరాచక పాలన కొనసాగకుండా అంతమొందించాలని మాజీ మంత్రి, జనసేన నాయకులు పడాల అరుణ పిలుపునిచ్చారు. బుధవారం కోమటిపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. వైసిపి పాలనలో భూ దందాలు, ఇసుక దోపిడీ, భూముల అక్రమ అమ్మకాలు, అక్రమ అప్పులు, నిరుద్యోగ సమస్య, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉద్యోగులకు వేధింపులు, ప్రతిపక్షం పై కక్ష సాధింపు, పలు రకాల సమస్యలతో ప్రజల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసి, దౌర్జన్యాలు చేసి, ఎలాగైనా అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నుతున్నారని, దీన్ని ప్రజలంతా గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గజపతినగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మొనకాల జగన్ అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు గెద్ద రవి, గేదెల మంగమ్మ, మండల పార్టీ అధ్యక్షులు చప్ప అప్పారావు, జిల్లా రామారావు, కోమటిపల్లి వైస్ సర్పంచ్ వసంత శ్రీనివాసరావు, నాయకులు మామిడి దుర్గాప్రసాద్, విజరు, గణేష్, గేదెల రామసత్యం తదితరులు పాల్గొన్నారు.