అమెజాన్ ఉద్యోగులకు మరో షాక్ తగిలింది. కోవిడ్ కారణంగా ఎంతోమంది ఉద్యోగులకు ఈ కంపెనీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఉద్యోగులకు అమెజాన్ మరో షాక్ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీసులో పని చేయని వారికి ప్రమోషన్లు నిలిపివేస్తామని అమెజాన్ కంపెనీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీచేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రం ఆఫీస్ పని విధానాన్ని ప్రోత్సహించాలని ఆ కంపెనీ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఒకవేళ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పని విధానాన్నే కోరుకుంటే.. వారు తప్పనిసరిగా అందుకు గల కారణాల్ని వివరిస్తూ… వైస్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలని కంపెనీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగుల ప్రమోషన్ బాధ్యతల్ని కూడా ఆయా విభాగాల మేనేజర్లదేనని అమెజాన్ ఉద్యోగులకు ఓ ఇంటర్నల్ ఇ-మెయిల్ కూడా పంపిందని నివేదికలు వెల్లడించాయి.
వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ ఏడాది ఫిబ్రరిలో పేర్కొన్నారు. అయితే ఈ విధానానికి వ్యతిరేకంగా మే నెలల్లో వేలాది మంది ఉద్యోగులు సియోటెల్‌లో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఉద్యోగుల ఆందోళనలను ఆ కంపెనీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఉద్యోగంలో కొనసాగాలనుకుంటే తప్పనిసరిగా వర్క్ ఫ్రం ఆఫీస్ విధానానికి కట్టుబడాలని ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ సిఇఓ తెలిపారు.