అదాని కేసులో తీర్పు రిజర్వు

Nov 24,2023 21:02 #Business

న్యూఢిల్లీ : తీవ్ర అకౌటింగ్‌ మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదాని కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని.. హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌తో ఆ కంపెనీల సూచీలు భారీ పతనాన్ని చవి చూడటంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిన విషయం తెలిసిందే. అదానిపై వచ్చిన ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం సెబీని విచారణకు ఆదేశించింది. కాగా దీనిపై శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించడంతో పాటుగా తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ కేసు విషయంలో సెబీ ప్రవర్తన విశ్వసనీయంగా లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. సెబి విచారణ నమ్మదగినది కాదని.. 13 నుండి 14 సంస్థలతో అదానీకి సంబంధాలు ఉన్నాయన్నారు. ఫారిన్‌ పోర్టుపోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పిఐ) మార్గదర్శకాలను విచారణ కమిటీ పరిశీలించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో విచారణను పూర్తి చేసేందుకు ఇకపై పొడిగింపును కోరబోమని సుప్రీంకోర్టుకు సెబీ తెలిపింది. పెట్టుబడిదారుల విలువపై మార్కెట్‌ రెగ్యులేటర్‌ ఏమి చేస్తోందంటూ ధర్మాసనం ప్రశ్నించింది. వారి సొమ్ము రక్షణకు భరోసా ఇస్తున్నారా అంటూ సెబీని అడిగింది. స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర అస్థిరత ఉందని.. ఇన్వెస్టర్ల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ షార్ట్‌ సెల్లింగ్‌ సందర్భాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.రెగ్యులేటరీ మెకానిజమ్‌ను బలోపేతం చేసేందుకు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలనలో ఉన్నాయని, వాటికి సెబీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఆ రెగ్యూలేటరీ సంస్థ తరపు న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. అదాని గ్రూపునపై 24 అరోపణలు రాగా.. వాటిలో 22 కేసుల దర్యాప్తును ముగించామన్నారు. మిగిలిన రెండింటి విషయంలో విదేశీ నియంత్రణ సంస్థల నుండి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఈ కేసులో దాదాపు విచారణ పూర్తి అయ్యిందని సెబీ కోర్టుకు తెలిపింది. భవిష్యత్తులో మొత్తం 24 కేసుల్లో విచారణను పూర్తి చేసి, నిపుణుల కమిటీ సిఫార్సులతో చట్ట ప్రకారం కొనసాగాలని సెబీకి కోర్టు సూచించింది. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని ఆరోపణలను నిజమని తాము అంగీకరించాల్సిన అవసరం లేదని సిజెఐ అన్నారు. వార్తా పత్రికలో ప్రచురితమైన దానిని సత్యంగా పరిగణించాలని.. చట్టబద్ధమైన సంస్థను అడగలేమని పేర్కొన్నారు. సెబీని అనుమానించడానికి తమ ముందు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

➡️