ఎల్‌ఐసి బంఫర్‌ పాలసీ ఆవిష్కరణ

Nov 29,2023 21:05 #Business

కొత్తగా జీవన్‌ ఉత్సవ్‌ ప్లాన్‌ఐదేళ్లు చెల్లిస్తే చాలు.. ప్రతీ ఏడాది గ్యారంటీ ఆదాయం

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసి పాలసీదారులను మరింత ఆకర్షించడానికి మరో వినూత్న పాలసీని ఆవిష్కరించింది. పొదుపు బీమాతో పాటు గ్యారంటీ రాబడిని ఇచ్చే జీవన్‌ ఉత్సవ్‌ ప్లాన్‌ను బుధవారం విడుదల చేసింది. ప్లాన్‌ నెంబర్‌ 871తో ఆవిష్కరించిన ఈ నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం బీమా అందించే పాలసీని అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌ఐసి వెల్లడించింది. ఈ పరిమిత ప్లాన్‌లో 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠ బీమా మొత్తం రూ.5 లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం చెల్లింపు, వెయిటింగ్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత పాలసీదారుడికి జీవితాంతం ఈ ప్లాన్‌ కింద ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీపై రుణం తీసుకునే సౌలభ్యం కూడా కల్పించింది. ఈ పాలసీని ముంబయి సెంట్రల్‌ ఆఫీస్‌లో ఆవిష్కరించగా.. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను హైదరాబాద్‌లోనూ అధికారులు విడుదల చేశారు.జీవన్‌ ఉత్సవ్‌ ప్లాన్‌ వివరాలు.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందడానికి వీలుంది. ప్రీమియం టర్మ్‌, వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత ఏటా ఆదాయాన్ని పొందవచ్చు. రెగ్యులర్‌ ఆదాయం వద్దనుకుంటే పాలసీదారు ప్లెక్సీ విధానం ఎంచుకోవచ్చు. దీనికి చక్రవడ్డీ అందిస్తుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకు బీమా సదుపాయం కల్పించింది. ఈ ప్లాన్‌లో మూడు నెలల చిన్నారుల నుంచి 65 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. కనీసం 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 5 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ 6 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎంచుకుంటే 3 సంవత్సరాలు, 8-16 సంవత్సరాలు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే 2 ఏళ్ల తర్వాత బీమా హామీ మొత్తంలో ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం ఆదాయం పొందేలా ఈ పాలసీలో ఆకర్షణీయ ఫీచర్లను రూపొందించారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే చెందితే డెత్‌ బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్లు ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఈ పాలసీని ఎల్‌ఐసి ఏజెంట్‌ లేదా ఆన్‌లైన్‌లో గాని కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లో జీవన్‌ ఉత్సవ్‌ ప్లాన్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ ఎల్‌కె శ్యామ్‌ సుందర్‌, సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ రాజీబ్‌ బిశ్వాస్‌, ఎస్‌బిఎ సుబ్బా రావు ఇతర ఉన్నతాధికారులు ఆర్‌ సతీష్‌ బాబు, రాజేష్‌ భరద్వాజ్‌, ఉతుప్‌ జోసెఫ్‌, ఎంఎంపి శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గన్నారు.

➡️