న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ వేదిక పేటియం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్ తన వాటాలను పూర్తిగా విక్రయించారు. బఫెట్‌కు చెందిన బర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ తన 2.46 శాతం వాటాను రూ.1,371 కోట్లకు అమ్మేశారు. ఓపెన్ మార్కెట్‌లో ప్రతీ షేర్‌పై 31 శాతం నష్టంతో విక్రయించారు. 1.56 కోట్ల షేర్లను రూ.620 కోట్లకు వదిలేసుకున్నారు. దీంతో శుక్రవారం బిఎస్‌ఇలో వన్ 97 కమ్యూనికేషన్ షేర్ 3.08 శాతం పతనమై రూ.895 వద్ద ముగిసింది. పేటియంలో ఇంతక్రితం బఫెట్ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.1,279.7తో 2.6 శాతం వాటాను రూ.2,179 కోట్లతో కొనుగోలు చేసింది. ఎన్‌ఎస్‌ఇ డేటా ప్రకారం.. శుక్రవారం సెషన్‌లో సగటున ఒక్కో షేర్‌ను రూ.877.29కు విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పేటియం రూ.291.7 కోట్ల నష్టాలను చవి చూసింది. గతేడాది ఇదే త్రైమాసికంలోనూ రూ.571.5 కోట్ల నష్టాలను ప్రకటించింది. క్రితం క్యూ2లో కంపెనీ రెవెన్యూ 32 శాతం పెరిగి రూ.2,518.6 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,914 కోట్లుగా ఉంది.