సుస్థిరత కోసమే వ్యక్తిగత రుణాలపై వెయిటేజీ
ఆర్‌బిఐ గవర్నర్ దాస్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ధరల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. బుధవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ (ఫిక్కీ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఒ) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శక్తికాంత దాస్ పాల్గని మాట్లాడారు. తాను ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళితే అక్కడే ఉన్న సిఐఎస్‌ఎఫ్ బృందం కూడా అధిక ధరలు, వడ్డీ రేట్ల గురించి ప్రశ్నలడిగారని దాస్ తెలిపారు. ప్రజలకు ఆర్థిక అంశాలపై ఎంతో అవగాహన ఉందన్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో అహారోత్పత్తుల ధరలు ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు.
ద్రవ్యోల్బణం క్రమంగా అదుపులోకి వస్తోందన్నారు. అమెరికా ట్రెజరీ రాబడులు అధికంగా ఉన్నప్పటికీ.. రూపాయి స్వల్ప స్థాయిలోనే ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. ధరల ఒత్తిడిని అధిగమించాలంటే వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, మార్కెటింగ్‌లో సంస్కరణలు అవసరమన్నారు. రుణాల జారీలో సుస్థిరత సాధించాలన్న లక్ష్యంతోనే వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలపై రిస్క్ వెయిట్‌ను పెంచినట్లు తెలిపారు. వృద్థిని దృష్టిలో పెట్టుకునే గృహ, వాహన రుణాలను అందులోంచి మినహాయించామన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. అయినప్పటికీ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.