త్వరలో 3-4 కొత్త బీమా ప్లాన్లు

Nov 23,2023 21:05 #Business

రెండంకెల వృద్థి లక్ష్యం-ఎల్‌ఐసి ఛైర్మన్‌ సిద్ధార్థ వెల్లడి

న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైప్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) వచ్చే కొన్ని నెలల్లో 3-4 కొత్త బీమా ప్లాన్లను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. దీంతో నూతన ప్రీమియం వ్యాపారంలో రెండంకెల వృద్థిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ”మేము రెండంకెల వఅద్ధిని అంచనా వేస్తున్నాము. వ్యక్తిగత రిటైల్‌ వ్యాపారంలో ఇటీవలి పరిస్థితులు పురోగమిస్తున్నందున నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించబోతున్నాము. మా నిబద్ధతను మరింత బలోపేతం చేయడానికి, మేము కొన్ని కొత్త ఆకర్షణీయమైన ఉత్పత్తులను ప్రారంభించబోతున్నాము.” అని ఎల్‌ఐసి ఛైర్మన్‌ సిద్ధార్థ మొహంతి ఓ ఇంటర్యూలో తెలిపారు.”డిసెంబర్‌ మొదటి వారంలో ఎల్‌ఐసి ఒక నూతన ప్లాన్‌ను ఆవిష్కరించనుంది. ఇది మార్కెట్లో పాలసీదారులను చాలా ఆకర్షించనుంది. ఇది హామీ ఇవ్వబడిన రాబడిని అందజేస్తుంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు జీవితకాల బీమా మొత్తంలో 10 శాతం పొందుతారు. ప్రతి ఒక్కరూ ఎంత చెల్లిస్తున్నారో..?, 20-25 సంవత్సరాల తర్వాత పొందే రాబడిని తెలుసుకోవాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న కొత్త ప్లాన్‌ మార్కెట్‌లో ఆదరణను పొందనుంది. దీనిపై అదనంగా రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణ కూడా కొత్త ఉత్పత్తిలో ఫీచర్‌గా ఉండనుంది.” అని సిద్దార్థ తెలిపారు. పాలసీదారులు, వాటాదారుల ఆసక్తి మేరకు నూతన పాలసీలో గ్యారంటీ రిటర్న్స్‌ ఉండటంతో పాలసీదారులకు లబ్ధి చేకూరనుందన్నారు. తమ సంస్థలో పాలసీదారులే అధికంగా వాటాదారులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కొత్త బిజినెస్‌ ప్రీమియంలో రెండంకెల వృద్థిని సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే మరో 2-3 పాలసీలను ప్రారంభించనున్నట్లు మహంతి తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్థంలో ఎల్‌ఐసి కొత్త వ్యాపార ప్రీమియం ఆదాయం (వ్యక్తిగత) విభాగం 2.65 శాతం వృద్థితో రూ. 25,184 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో రూ.24,535 కోట్ల వ్యాపారం నమోదయ్యింది. నూతన వ్యాపార ప్రీమియం అనేది మొదటి పాలసీ సంవత్సరంలో చెల్లించాల్సిన బీమా ప్రీమియం లేదా పాలసీదారు నుండి ఒకే మొత్తం చెల్లింపు. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి ఎల్‌ఐసి అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎయుఎం) రూ.47,43,389 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇది రూ.42,93,778 కోట్లుగా ఉంది. బీమా రంగంలో 70.26 మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో ఎల్‌ఐసి రికార్డ్‌ స్థాయిలో రూ.17,469కోట్ల లాభాలు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.16,635 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పెట్టుబడులపై నికర ఆదాయం రూ.93,942 కోట్లకు పెరిగింది. ఇది 2022-23లో రూ.84,104 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు 5.60 శాతంగా ఉండగా.. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి 2.43 శాతానికి తగ్గాయి.

➡️