న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థం (హెచ్1)లో భారత్‌లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ఈక్విటీల్లో 24 శాతం పతనమై 20.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ మొత్తం కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికం, ఆటో, ఫార్మా తదితర రంగాల్లోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం ఇదే ప్రథమార్థంలో 26.91 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు నమోదయ్యాయి. ఏడాదికేడాదితో పోల్చితే 2023 జనవరి ా మార్చి ఎఫ్‌డిఐల్లో 40.55 శాతం క్షీణించి 9.28 బిలియన్ డాలర్లుగా, జూన్ త్రైమాసికంలో 34 శాతం క్షీణించి 10.94 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. జులై, ఆగస్ట్‌లోనూ ఎఫ్‌డిఐ రాకలో పతనం చోటు చేసుకోగా.. సెప్టెంబర్‌లో మాత్రం 4.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఇదే సెప్టెంబర్‌లో 2.97 బిలియన్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. గడిచిన ప్రథమార్థంలో సింగపూర్, మారిషస్, అమెరికా, బ్రిటన్, యుఎఇల నుంచి వచ్చే ఎఫ్‌డిఐల్లో అధికంగా తగ్గుదల చోటు చేసుకుంది. నెథర్లాండ్, జపాన్, జర్మనీ నుంచి వచ్చే ఎఫ్‌డిఐల్లో పెరుగుదల ఉంది. వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఆకర్షించాయి. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్లు కఠినతరం కావడానికి తోడు భౌగోళికంగా పలు ఆందోళనలు నెలకొనడం ఎఫ్‌డిఐలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఓ అధికారి పేర్కొన్నారు.