న్యూఢిల్లీ : దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బిఐ తన డిజిటల్ బ్యాంకింగ్ యాప్ ‘యోనో’ను అమెరికా, సింగపూర్‌లకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఆ రెండు దేశాల్లో త్వరలోనే సేవలను అందుబాటులోకి తేనున్నామని ఎస్‌బిఐ ఐటి విభాగం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ విద్య కృష్ణన్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలతో పాటు ఇతర బ్యాంకింగ్ ఆధారిత సేవలను ఆయా దేశాల్లోని వినియోగదారులు పొందవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం సింగపూర్‌కు చెందిన డిజిటల్ లావాదేవీల నిర్వహణ సంస్థతో పాటు, సింగపూర్ మానిటరీ అథారిటీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రస్తుతం ఎస్‌బిఐ యోనో గ్లోబల్ సర్వీసులు 9 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 2019లో బ్రిటన్‌లో ప్రారంభించిన ఈ సర్వీసులను క్రమంగా మారిషస్, కెనడా, బహ్రెయిన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్‌లకు విస్తరించారు.