న్యూఢిల్లీ : ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్‌ఎఫ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు చేపట్టింది. సూపర్‌టెక్ గ్రూప్ రియాల్టీ సంస్థ మనీలాండరింగ్ కేసులో భాగంగా గురుగావ్‌లోని డిఎల్‌ఎఫ్ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా.. సూపర్ టెక్ వ్యవహారంలోనే కంపెనీకి సంబంధించిన లావాదేవీలను అధికారులు తనిఖీ చేశారని రిపోర్టులు వస్తున్నాయి. సూపర్ టెక్ ప్రమోటర్ అయిన ఆర్‌కె అరోరా 670 మంది గృహ కొనుగోలుదారులను రూ.164 కోట్లు మేర మోసగించారని ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై వివిధ పోలీస్‌స్టేషన్లలో 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మదుపరులు, గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన కోట్లాది రూపాయల నగదును వివిధ డొల్ల కంపెనీలకు తరలించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరోరాను గడిచిన జూన్‌లో ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇది కేసు నమోదు చేసింది. మొత్తం రూ.440 కోట్ల మేర నిధులను నిబంధనలకు విరుద్దంగా డొల్ల కంపెనీలకు తరలించారని అంచనా. గడిచిన 30 ఏళ్లలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సూపర్‌టెక్ కంపెనీ దాదాపు 80వేల ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతం మరో 20 వేల గృహాలకు సంబంధించిన 25 ప్రాజెక్టులను అభివృద్థి చేస్తోంది. రెండేళ్ల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా అభివృద్థి చేసిన ట్విన్ టవర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేయడంతో కంపెనీకి రూ.500 కోట్లు మేర నష్టం రావడంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటుంది. మరోవైపు యూనియన్ బ్యాంక్‌కు రూ.432 కోట్లు ఎగవేసిన కేసులో ఎన్‌సిఎల్‌టిలో దివాలా ప్రక్రియను ఎదుర్కొంటుంది.