ముంబయి : దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసి షేర్లు వారాంతం సెషన్‌లో జిగేల్‌మన్నాయి. శుక్రవారం రికార్డ్ స్థాయిలో 10 శాతం ఎగిసి.. రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. లిస్టింగ్ తర్వాత ఒక్క పూటలోనే ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మరో రెండు ప్రభుత్వ రంగ బీమా సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. జనరల్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు విలువ 18 శాతం పెరిగింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేరు 20 శాతం మేర ర్యాలీ చేసింది. ఎల్‌ఐసి షేర్ 9.69 శాతం పెరిగి రూ.677.65 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వఅద్ధి సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఎల్‌ఐసి ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. కొత్త వ్యాపార ప్రీమియంలో వఅద్ధి సాధించటంలో భాగంగా రానున్న నెలల్లో 3-4 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ప్రకటన ఆ సంస్థ సూచీ ర్యాలీకి దోహదం చేసింది. జనరల్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ 16.70 శాతం పెరిగి రూ.307.55 వద్ద ముగిసింది. మరో పిఎస్‌యు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేర్ 20 శాతం లాభపడి రూ.209.40 వద్ద ముగిసింది.