భారత రాజ్యాంగం, రాజ్యాంగ సభ ముందుకు వచ్చిన సమయంలోనే…ఈ రాజ్యాంగాన్ని తాము అంగీకరించమని, ఇది హిందువులకు ఆమోదయోగ్యం కాదని, ఇది ఒక అతుకుల బొంత అని, తరతరాలుగా భారత సమాజాన్ని నడిపించిన అసలు సిసలు రాజ్యాంగమైన ‘మనుస్మృతి’ని ఈ రాజ్యాంగ నిర్మాతలు విస్మరించారని, మనుస్మృతి ప్రస్తావన లేదు కాబట్టి దీన్ని తాము తిరస్కరిస్తున్నట్లు బహిరంగంగానే నాడు ఆర్.ఎస్.ఎస్ ప్రకటించింది. తర్వాత తాత్కాలికంగా కొంత వెనక్కి తగ్గినట్లు నటించినా హిందూత్వ ఫాసిస్టు శక్తులు భారత రాజ్యాంగ మౌలిక విలువలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గత పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న ఈ శక్తులు రాజ్యాంగంపై పూర్తి స్థాయిలో దాడి ఎక్కుపెట్టాయి.
స్వతంత్ర భారత చరిత్రలో నవంబర్ 26 అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు. మరీ ముఖ్యంగా ఆధునిక, లౌకిక, ప్రజాస్వామ్య, భారతదేశ నిర్మాణంలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. కారణం 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. మన దేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. ఆ రోజుతో తెల్లవాడి పాలన, అంటే సామ్రాజ్యవాదుల పాలన అంతమై అధికారం బడా పెట్టుబడిదారీ పాలక వర్గాల చేతుల్లోకి బదలాయించబడింది. ఈ నూతన పాలక వర్గాల రాజ్యం భారత రాజ్యాంగ సభను రూపొందించింది. ఆ రాజ్యాంగ సభే నూతన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చర్చ యావత్తూ సహజంగానే రాజ్యాంగం చుట్టే తిరుగుతుంది. రాజ్యాన్ని నిర్వహిస్తున్న బడా పెట్టుబడిదారులు, వారి మిత్ర వర్గాల గురించి చర్చ జరగటం తగ్గిపోయింది. గడచిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో భారత రాజ్యాంగం అనేకసార్లు సవరించబడింది. అనేకసార్లు పాలకవర్గాలు తమ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగసభలో ముసాయిదాని ప్రవేశపెడుతూ ”రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదైనా దాన్ని అమలు చేసేవారు ఉన్నతులు కాకపోతే అది ఒక చెడ్డ రాజ్యాంగంగానే నిరూపించబడుతుంది” అని చేసిన హెచ్చరిక ఆధారంగా భారత రాజ్యాంగం అమలు చరిత్రని విశ్లేషించాల్సి ఉంటుంది.ప్రత్యేకించి భారత రాజ్యాంగం, రాజ్యాంగ సభ ముందుకు వచ్చిన సమయంలోనే…ఈ రాజ్యాంగాన్ని తాము అంగీకరించమని, ఇది హిందువులకు ఆమోదయోగ్యం కాదని, ఇది ఒక అతుకుల బొంత అని, తరతరాలుగా భారత సమాజాన్ని నడిపించిన అసలు సిసలు రాజ్యాంగమైన ‘మనుస్మృతి’ని ఈ రాజ్యాంగ నిర్మాతలు విస్మరించారని, మనుస్మృతి ప్రస్తావన లేదు కాబట్టి దీన్ని తాము తిరస్కరిస్తున్నట్లు బహిరంగంగానే నాడు ఆర్.ఎస్.ఎస్ ప్రకటించింది. తర్వాత తాత్కాలికంగా కొంత వెనక్కి తగ్గినట్లు నటించినా హిందూత్వ ఫాసిస్టు శక్తులు భారత రాజ్యాంగ మౌలిక విలువలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. గత పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న ఈ శక్తులు రాజ్యాంగంపై పూర్తి స్థాయిలో దాడి ఎక్కుపెట్టాయి. అందువలన ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం గురించి అలాగే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే రాజ్యం గురించి కూడా తెలుసుకోవాలి. దీనిపై చర్చ జరగాలి.రాజ్యాంగం మూడు ముక్కల్లో…మనది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రాతపూర్వక రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అంతిమంగా రూపుదిద్దుకోవటానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు చర్చలు జరిగాయి. 299 మందితో కూడిన రాజ్యాంగ సభలో ముసాయిదాపై చర్చ చేసిన అనంతరం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగంలో మూడు విభాగాలు ఉన్నాయి. ఒకటి పీఠిక. రెండు ప్రాథమిక హక్కులు. మూడు ఆదేశిక సూత్రాలు. ఈ మూడింటినీ విడివిడిగా తెలుసుకోవడమే కాదు. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధంతో కలిపి చూస్తేనే భారత రాజ్యాంగ స్ఫూర్తి, స్వభావం, లక్ష్యం అర్థం అవుతాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పులో ”రాజ్యాంగాన్ని కేవలం ఒక డాక్యుమెంట్‌గా పరిగణించరాదు. ఒక వీలునామాగానో, ఇద్దరి మధ్య జరిగిన ఒక ఒప్పంద పత్రంగానో చూడరాదు. రాజ్యాంగం జాతి జీవనం యొక్క వాహకం. రాజ్యాంగం ద్వారం కాదు మార్గమని మర్చిపోరాదు. రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో ప్రతిదీ నిరంతరం మారుతుందని, ఒక వ్యక్తి యొక్క లేదా దేశం యొక్క జీవితం నిశ్చలంగా ఉండకుండా అభివృద్ధి చెందుతూ ఉండాలని నిర్మాతలు భావించారు. రాజ్యాంగం యొక్క మూలాలు గత చరిత్రలోను, వర్తమానంలో దాని కొనసాగింపు ప్రతిఫలించే విధంగానూ, అంతం లేని భవిష్యత్తు వైపు దేశాన్ని నడిపించేదిగాను ఉంటుంది.” అని పేర్కొంది. పీఠికలో మొదట, చివర ”ప్రజలమైన మేము” అని ”ప్రజలుగా మాకు మేము సమర్పించుకుంటున్నామని” వుండటం యాదృచ్ఛికం కాదు. అనేక ఇతర దేశాల రాజ్యాంగాల మాదిరిగా ఎక్కడా భగవంతుని ప్రస్తావన లేదు. ఈ రాజ్యాంగం ప్రజలదని, దాన్ని అమలు చేయించుకోవాల్సింది ప్రజలేనని, మార్చాల్సి వస్తే అది కూడా ప్రజలకుండే హక్కేనని పీఠిక తెలియచేస్తున్నది. ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడ్డ పౌరుల హక్కులు-సమాన హక్కు, అంటే చట్టం ముందు మత, జాతి, కుల, లింగ భేదం లేకుండా అందరూ సమానమే అనడం. అంటరానితనం నిర్మూలన, వాక్ స్వాతంత్య్రం, సంఘాలు ఏర్పరచుకోవడం, దేశంలో ఎక్కడికైనా సంచరించడం, ఏ పనినైనా ఎంచుకోవడం, ఏ మతాన్నయినా ఆచరించడం, ప్రచారం చేసుకోవడం వంటివి అనేకం ఉన్నాయి. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని భావించిన ఏ పౌరుడైనా, పౌరురాలైనా, సంస్థ అయినా రాజ్యాంగ ధర్మాసనంలో కేసు వేయడం కోసం ఉన్న 32వ అధికరణ అత్యంత విలువైనది. అంబేద్కర్ మొత్తం రాజ్యాంగంలో ఉన్న అధికరణలన్నింటిలో కన్నా అత్యంత విలువైనది ఏది అన్నప్పుడు ఈ ”32వ అధికరణ రాజ్యాంగం యొక్క గుండె, ఆత్మ.” అని పేర్కొన్నారు. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి జీవం. రాజ్యాంగం ఆధారంగా పాలక వర్గాలు ఈ దేశంలో పార్లమెంటరీ, గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థని రూపొందించడానికి ఉద్దేశించబడినవే ఈ ఆదేశిక సూత్రాలు.ఇంత విలువైన, దూరదృష్టితో కూడిన, వేల సంవత్సరాల మొత్తం భారత సమాజాన్ని రంగరించి రూపొందించిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనదిగా కీర్తించబడుతున్నది. అనేక దేశాలలో రాజ్యాంగాలు అమలులోనే అంతమైపోయాయి. కానీ 74 సంవత్సరాలుగా మన రాజ్యాంగాన్ని నిలుపుకుంటూనే ఉన్నాం. ఇందుకు మరో కారణం కూడా ఉన్నది. భారత రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేసే అవకాశం లేదు. కానీ అవసరమైన సందర్భాలలో మారిన పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వబడింది. ఇప్పటికే వందసార్లకు పైగా సవరణలు చేశారు. అయితే మొత్తం రాజ్యాంగాన్నే అంతం చేయడానికి గత 75 సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.రాజ్యాంగంపై హిందుత్వ దాడి 1999లో వచ్చిన బిజెపి వాజ్‌పేయి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలనే భయంకరమైన కుట్రకి తెరలేపింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వంలో ఓ కమిషన్ కూడా వేసేసింది. నిజానికి రాజ్యాంగాన్ని సమీక్షించే హక్కు ప్రభుత్వానికి రాజ్యాంగం ఇవ్వలేదు. కానీ బిజెపిి నాటి ఎన్‌డిఎ ప్రభుత్వం వేసిన ఈ కమిషన్ రెండు సంవత్సరాలు చర్చించి 2002లో 1979 పేజీల నివేదికను సమర్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేవడంతో వెనక్కి తగ్గింది. కానీ వారి ప్రయత్నాలు మరలా 2014 నుండి ముమ్మరం చేశారు. ఈ దాడి ప్రస్తుతం బహుముఖంగా ఉంది. భారతదేశం పేరుపై వివాదం సృష్టించడం వంటి చులకనైన వాదనల నుంచి పీఠికలో లౌకికవాదం, సామ్యవాదం పదాలు ఎత్తివేయాలనే దాకా బిజెపి వెళ్తోంది. మొత్తంగా భారత రాజ్యాంగాన్ని అంతం చేసి దాని స్థానంలో అతి క్రూరమైన అసమానతలకు, వివక్షతలకు ప్రతిరూపమైన మను ధర్మాన్ని ప్రతిష్టించాలన్నది వారి ఉబలాటం. ఈ క్రమంలో అడ్డగోలుగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నారు. నేడు భారత రాజ్యాంగం ఒక తీవ్రమైన దాడికి గురవుతున్నది. నిలువరించకుంటే పర్యవసానం భయానకంగా ఉంటుంది.రాజ్యాన్ని నిలదీయాలి ప్రారంభంలో చెప్పుకున్నట్లు రాజ్యాంగం గొప్పతనం గురించి, దానిపై జరుగుతున్న దాడి గురించి, ఈ సందర్భంగా న్యాయస్థానాల తీర్పుల గురించి మాత్రమే చర్చించుకుంటే సరిపోదు. ఈ 74 సంవత్సరాల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకవర్గాల ప్రయోజనాలు, వాటిని పరిరక్షించుకోవడానికి ఏర్పడిన రాజ్యం గురించి నేడు లోతైన చర్చ జరగాలి. భారత రాజ్యాంగం అమలుకి ఒక రోజు ముందు సభలో ప్రసంగిస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ”26 జనవరి 1950తో మనం ఓ వైరుధ్య భరిత జీవితంలోకి అడుగుపెడుతున్నాం. రాజకీయాల్లో సమానత్వం, సాంఘిక, ఆర్థిక జీవితంలో అసమానతలు. ఈ క్రమంలో ఒకే వ్యక్తి, ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉన్నాం. ఎంత కాలం మన జీవితాల్లో ఈ వైరుధ్యం కొనసాగుతుంది. సాంఘిక ఆర్థిక జీవితాల్లో ఇంకెంత కాలం మనం సమానత్వాన్ని నిరాకరిస్తూ ఉంటాం. ఇలాగే దీర్ఘకాలం కొనసాగిస్తే మనకి మనమే ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాం. ఈ వైరుధ్యాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్మూలించాలి. లేకుంటే ఈ అసమానత్వంతో బాధపడుతున్న వారు ఈ రాజ్యాంగసభ ఎంతో కష్టపడి రూపొందించిన ఈ ప్రజాస్వామ్య రాజ్యాన్ని బద్దలు కొడతారు” అని తీవ్రంగా హెచ్చరించారు. దీన్ని బట్టి రాజ్యాంగం కన్నా రాజ్యంపై చర్చ ప్రజాక్షేత్రంలో కేంద్ర బిందువు కావాలి. ఎందుచేతనంటే మార్క్సిస్టు మహోపాధ్యాయుడు ఏంగెల్స్ ”పెట్టుబడిదారుల్లోనే కాదు, ఊగిసలాడే సోషల్ డెమోక్రటిక్ శక్తుల్లో కూడా రాజ్యాంగాల మీద అమితమైన మూఢభక్తి వ్యక్తం అవుతున్నది” అన్నారు. అది మన దేశంలో కూడా కనబడుతున్నది. రాజ్యం గురించి కారల్ మార్క్స్ స్పష్టమైన నిర్వచనాన్ని ఏనాడో వెలువరించారు. ”రాజ్యం అనేది ఒక వర్గాన్ని మరో వర్గం అణచి వుంచే ఆయుధం తప్ప మరోటి కాదు. ఇది రాచరిక పాలనలో ఎంత నిజమో, ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాల్లో కూడా అంతే నిజం”. అని చెబుతూ అమెరికాని ఉదహరిస్తూ అక్కడ ”రాజకీయ చట్టా వ్యాపారుల గ్యాంగులు రెండు ఒకదాని తర్వాత ఒకటి రాజ్యాధికారానికి వచ్చి, అత్యంత అవినీతి పద్ధతుల ద్వారా, అత్యంత అవినీతి లక్ష్యాల కోసం దోచుకుంటూనే ఉంటాయి.” అని చెప్పిన అంశాలు మన దేశానికి కూడా దాదాపుగా సరిపోతాయి. అంతేకాదు, రాజ్యం గురించి వివరిస్తూ కారల్ మార్క్స్ ”పోలీసు, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ వంటివి పౌర సమాజ ప్రతినిధులు కాదు… అవి రాజ్యం యొక్క ప్రతినిధులు. దాని యొక్క కర్తవ్యమల్లా పౌర సమాజానికి వ్యతిరేకంగా రాజ్యం కోసం పని చేయటమే” అంటాడు. ”ప్రజాప్రతినిధులను ఓట్లేసే ప్రజల నుండి వేరు చేయడం ద్వారా రాజ్యం నుండి పౌర సమాజాన్ని వేరు చేయడం జరుగుతుంది. ప్రజా సంబంధాలను నిర్వహించే అధికారం ఉన్న ప్రజా ప్రతినిధులు వాస్తవానికి వేరే ప్రత్యేక (దోపిడీ వర్గాల) ప్రయోజనాల కోసం పని చేస్తూ ఉంటారు.” అన్నారు. మన దేశంలో కూడా రాజ్యం బడా పెట్టుబడిదారుల చేతుల్లో ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరంలోనే పాలకవర్గాలు సవరించడం ప్రారంభించాయి. 7 సంవత్సరాలు గడవక ముందే కేరళలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సహించలేక రాజ్యాంగం పేరు చెప్పి కూలదోశారు. తాజాగా ఇ.బి.ఎస్ (ఎలక్టొరల్ బాండ్ స్కీమ్) గురించి చెప్పుకోవచ్చు. 2013లో కాంగ్రెస్ నాయకత్వాన ఉన్న యుపిఎ ప్రభుత్వం ‘ఎలక్టొరల్ ట్రస్ట్ స్కీమ్’ రూపొందించింది. దాని ద్వారా కార్పొరేట్ సంస్థలకి, రాజకీయ పార్టీలకి మధ్య బంధాన్ని కనబడకుండా చేయడానికి ఉద్దేశించబడింది. ఇప్పుడు బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత పకడ్బందీగా ఇ.బి.ఎస్ ను ప్రారంభించింది. అందుకు విదేశీ నిధుల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్.సి.ఆర్.ఏ), కంపెనీల చట్టం, ఆర్.బి.ఐ చట్టం, ఆదాయపు పన్ను చట్టం, చివరకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా 2017 ఫైనాన్స్ చట్టంలో భాగంగా మార్చివేశారు. తాజా లెక్కల ప్రకారం వందల, వేల కోట్లు ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపి కి అందుతున్నాయి. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టం. రోజురోజుకీ బడా పెట్టుబడిదారులు, గుత్త సంస్థలు, విదేశీ కార్పొరేట్ సంస్థలు తమ ప్రయోజనాల నిమిత్తం ప్రత్యేకించి ఈ సంక్షోభ కాలంలో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇందుకు మతోన్మాద ఫాసిస్టు పాలన తోడైంది. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే, దానిని మరింత మెరుగుపరుచుకుంటూ వుండాలి. ఉదాహరణకు రాజ్యాంగంలో సమ్మె హక్కు వంటి వాటిని ప్రాథమిక హక్కుల్లో చేర్చుకుంటూ ముందుకు పోవాలి. భారత పాలక వర్గాల పైన, వారి రాజ్యం పైన పోరాటం తప్పదు.
/ వ్యాసకర్త సిపిఐ(ఎం) కృష్ణా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు / ఆర్. రఘు