- అతి జాతీయవాదమే క్రికెట్‌ను నాశనం చేస్తోంది
భారత్ ఓటమి నన్నేమీ బాధ పెట్టలేదు! అతి జాతీయవాదమే క్రికెట్‌ను నాశనం చేస్తోందిక్రికెట్ వ్యామోహంతో నిండిపోయిన సమాజానికి చెందిన వ్యక్తిని కాను నేను. వాస్తవానికి, నాకు ప్రత్యేకించి క్రికెట్ అంటే ఇష్టమేమీ లేదని చెప్పగానే నా స్నేహితులు, దగ్గరి బంధువులు నా వంక చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా చూస్తారు. ఒక రకంగా చిరాకుగా కూడా చూస్తారు. చాలా అరుదుగా నేను ఆ క్రికెట్‌ను చూస్తాను. అత్యంత లాభదాయకమైన, మార్కెట్ ఆధారిత పరిశ్రమ స్థాయికి క్రికెట్ క్రీడను కుదించివేయడం నాకు అసహ్యంగా అనిపిస్తుంది. మన ‘స్టార్’ క్రికెటర్లపై కేంద్రీకృతమైన పురాణాలు, వారి ఆకర్షణీయమైన జీవన శైలి, వారి ‘వ్యవహారాలు’ లేదా కార్పొరేట్-బాలీవుడ్ సంబంధాలతో వారికి గల సాన్నిహిత్యం ఇవన్నీ నన్ను ఆకర్షించవు. పైగా, క్రికెట్‌ను ఒక రకమైన యుద్ధంగా, అంతర్జాతీయ మ్యాచ్‌లో విజయాన్ని సర్జికల్ దాడులతో సరిపోల్చేంత ‘జాతీయవాది’గా నేను ఇంకా మారలేదు. ఆదివారం, బయటి వ్యక్తి తరచుగా ఎదుర్కొనే ఒంటరితనం యొక్క తీవ్రత ఎలా వుంటుందో నేను అనుభవించాను. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ను ఓడించింది. అయినా, నేనేమీ గుండెలవిసేలా ఏడవలేదు. నా హృదయం కల్లోలం కాలేదు. నేను గాయపడేంతగా నాలో ‘జాతీయవాద’ అహం (ఇగో) లేదు. బదులుగా, ఆ ఓటమిని నేను చాలా లైట్‌గా తీసుకున్నాను. బాగా నిద్రపోయాను కూడా. అయితే, అసలే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయి, దేశ ప్రజలందరూ సామూహికంగా విచారం వ్యక్తం చేస్తూ వున్న తరుణంలో, ‘జాతి’గా పిలిచే కొత్త దేవుడిని ఆరాధించడానికి క్రికెట్‌ను ఒక తాంత్రిక పూజ స్థాయికి కుదించిపారేసిన వారితో నా భావాలను పంచుకోవడం అంత సులభమేమీ కాదని నాకు తెలుసు. ఎలాంటి ప్రేమ, అభిమానాలు చూపని నా తీరును, విలువ ఇవ్వని నా తటస్థ వైఖరిని వారు అసహ్యించుకోవచ్చు కూడా. నా జాతీయవాద ప్రామాణికాలను కూడా వారు శంకించవవచ్చు, అయినప్పటికీ, క్రికెట్ వ్యామోహాలతో నిండిపోయిన సమాజంలో నేనొక బయటి వ్యక్తిగా బతకడం అంత సులభమేమీ కాదు.ఇంత ఒంటరితనం వున్నప్పటికీ, ఇలా క్రికెట్‌కు బయటివాడుగా వుండడం కూడా కొంత లాభదాయకమే. ఎలా అంటే, మన స్టార్ క్రికెటర్లు (నిరంతరంగా ఏదో ఒక ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్లుగా వుండే వారు వివిధ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేలా చూసేందుకు, వాటిని నమ్మించేందుకు ప్రయత్నిస్తూ వుంటారు) నన్ను హిప్నటైజ్ చేయడానికి అనుమతించను. క్రికెట్ పేరుతో జరుగుతున్న దాన్నంతా నేను తీవ్రంగా, పదునుగా విమర్శించగలను. ఇది వారి దేశాభిమానం కాదు, దానికి బదులుగా, వారి హావభావాల్లో, ప్రాక్టీస్‌ల్లో ‘నగదు చెల్లింపు’ మ్యాజిక్‌ను చూడగలను. మనుషుల్లో స్వార్ధాన్ని తప్ప మంచిని చూడని వ్యక్తి(సినిక్)ని అంటూ మీరు నన్ను నిందించినా సరే, ఈ తరహా క్రికెట్ ముఖ్యంగా వ్యాపారం తప్ప మరొకటి కాదన్న విషయాన్ని అయితే నేను మరిచిపోను. ఉదాహరణకు చూసినట్లైతే మనవంటి దారిద్య్రంతో బాధపడే దేశంలో విరాట్ కోహ్లి ఐపిఎల్ కెరీర్ ద్వారా ఇప్పటికే రూ.126 కోట్లు సంపాదించాడు. ఐపిఎల్ 2023 వేలానికి సంబంధించి రోహిత్ శర్మ మార్కెట్ విలువ రూ.16 కోట్లు! పైగా ఇండియా ఛేంజ్ ఫోరమ్ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఎన్ని నియంత్రణా ఆంక్షలున్నప్పటికీ భారత్‌లో క్రికెట్ బెట్టింగ్, గాంబ్లింగ్ మార్కెట్ గణనీయమైన రీతిలో అభివృద్ధి చెందింది. 2023 చివరి నాటికి ఈ మార్కెట్ విలువ 200 కోట్ల అమెరికన్ డాలర్లు వుంటుందని అంచనా వేయబడింది. టీనేజర్లు, విద్యార్ధి, యువత సహా 34 కోట్ల మందికి పైగా భారతీయులు ఈ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొనడం మంచి విషయమో కాదో నిర్ణయించాల్సింది మనమే. వాస్తవానికి, ఈ క్రికెట్ స్టార్లందరూ నిస్వార్ధులైన దేశాభిమానులని, మన దేశానికి బేషరతుగా సేవ చేస్తున్నారని చిత్రీకరించడం తెలివితక్కువతనమే కాగలదు. ప్రపంచ కప్ రన్నరప్‌గా భారత బృందానికి దాదాపు రూ.16 కోట్ల నగదు బహుమతి అంతర్జాతీయ క్రికెట్ మండలి నుండి వస్తుందనే విషయం మరిచిపోరాదు. మీరు, నేను మన ‘రక్షకుడు’గా విలువనిచ్చే, కార్గిల్‌లో విధులు నిర్వర్తిస్తున్న సైనిక జవాను వేతనం స్కేలుతో దీన్ని పోల్చి చూడండి. అలాగే, క్రికెట్ ప్రపంచానికి బయటి వ్యక్తిగా, పురుష జాతి ఇగోను పెంచేందుకు ఒక వ్యూహంగా క్రికెట్‌ను ఉపయోగించే రాజకీయాలను కూడా నేను చూడగలను. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను ఒక యుద్ధం స్థాయికి కుదించే విషపూరితమైన టెలివిజన్ వార్తా చానెళ్ళు వుండడాన్ని మనం చూస్తున్నాం. ఇందులో ఇమిడి వున్న వికారం గురించి ఆలోచించండి. ఈ క్రికెట్ యుద్ధంలో ‘జై శ్రీరామ్’ అంటూ పెద్ద పెట్టున నినదించడమే మన ఆయుధంగా మారినట్లైతే, మన సమిష్టి క్షీణతను, మన క్రూరమైన ప్రవృత్తులను, ఆత్మవిశ్వాసం లేని మతాన్ని, ఆటను ఆటగా చూడలేని మన నిస్సహాయతను అది వెల్లడిస్తుంది. పాకిస్తానీ క్రికెటర్ సృజనాత్మక నైపుణ్యాలను ప్రశంసించడం ఈ రోజుల్లో ఇబ్బందికరంగా మారిందంటే మనల్ని జాతి వ్యతిరేకిగా ముద్ర వేస్తారేమోననే భయం వుండడమే కారణమా? అటువంటపుడు, భారత్, పాకిస్తాన్‌లు క్రికెట్ ఆడుతున్నపుడు, అతిగా జాతీయ భావాలు చెలరేగడమే అన్ని రకాల మానసిక, సాంస్కృతిక దురాక్రమణలకు కారణమవుతోందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. బహుశా, ఈ తరహా క్రికెట్ జాతీయవాదం పట్ల నాకు గల అసౌకర్యమే నన్ను కాపాడి వుంటుంది. ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. ఈ ఓటమి నన్ను బాధ పెట్టకుండా, వినయానికి సంబంధించిన అతి ముఖ్యమైన పాఠాన్ని నాకు నేర్పింది. అద్భుతమైన నరేంద్ర మోడీ స్టేడియం, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, వేలాదిమంది అభిమానులు వుండడం, అన్ని రకాల పూజలు, యజ్ఞాలు జరగడం ఇవన్నీ వున్నా, భారత్ విజయాన్ని సాధించలేకపోయింది. ఈ ఓటమి మనకు ఇవ్వాలనుకుంటున్న సందేశం అర్ధమేమిటో గ్రహించడానికి మనం సిద్ధంగా వున్నామా? ప్రతీదీ అశాశ్వతమేనని ఇది మనకు బోధించింది. నీ విజయం గానీ ఓటమి గానీ ఏదీ శాశ్వతం కాదు. ఈనాడు మీరు హీరో, రేపు మీరు జీరోకు పడిపోవచ్చు! అందువల్లే, ఈ ఓటమిని మనం అత్యంత హుందాగా స్వీకరించాలి, ఆమోదించాలి. అంతేగానీ మాస్ హిస్టీరియాతో లేదా సమిష్టి అవమానంతో కాదు. అలాగే, మన ‘ఇగో’, అది జాతీయవాదం పేరుతో పవిత్రం చేయబడినా కూడా ఒక భ్రమే. క్రికెట్‌ను సర్జికల్ దాడి స్థాయికి తగ్గించాలనుకుంటున్న యోధులందరికీ బహుశా, ఈ ఓటమి ఒక సందేశాన్ని ఇస్తోంది. వారందరినీ హుందాగా వ్యవహరించమని కోరుతోంది. ఆటను ఆటగానే చూడాలంటోంది. సమరశీల జాతీయవాదమనే అద్దాలు వారు చూసే తీరును ఎలా వక్రీకరిస్తున్నాయో అర్ధమవుతోంది. అంతర్జాతీయ సంఘీభావం, ఏకత్వమనే భావనను సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతోంది.
/ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో/ అవిజిత్ పాఠక్