ప్రజాశక్తి – వేటపాలెం
ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని జెడ్పి హైస్కూల్ హెచ్ఎం పి దుర్గాప్రసాద్ అన్నారు. స్థానిక జెడ్పి హైస్కూల్ నందు వినియోగదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి డి ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో శుక్రవారం మేలుకొలుపు సదస్సు ఏర్పాటు చేశారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. వాటి నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినియోగదారుల దినోత్సవం 2023 సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని అన్నారు. కొనుగోలు చేసే వస్తువులు, సేవల్లో లోపాలకు తగిన నష్టపరిహారం పొందే అవకాశం ఈ చట్టం కల్పించిందని అన్నారు. విద్యార్దులు రేపటి దేశ భవిష్యత్తని, వారు ఆరోగ్యంగా ఉండాలని, జంక్ ఫుడ్‌కు, కల్తీ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు సమయంలో, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పని సరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. వస్తువులు కొనుగోలు సందర్భంలో తయారీ తేదీ, తుదిగడువు, తయారీ దారుని చిరునామా, నాణ్యత, బరువు తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. విద్యార్ధులు తల్లిదండ్రులకు, బందుమిత్రులకు, స్నేహితులకు తెలియపర్చాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సోషల్ ఉపాద్యాయులు పివి రమణ, వి రాధాదేవి, ఎం జానమ్మ , జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు ఎస్డి మతీన్, ఎస్ఎ సర్దార్ పాల్గొన్నారు.