అద్దె చెల్లించలేదని సచివాలయ భవనానికి తాళం

Nov 24,2023 21:58

సచివాలయం ముందు నిరసన తెలుపుతున్న ఇంటి యజమాని నాగరాజు

        హిందూపురం : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే ఈ వ్యవస్థ తీసుకువచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా గాడిలో పడలేదు. సచివాలయ వ్యవస్థ ప్రారంభం సమయంలో పురపాలక సంఘంలో సచివాలయాలను ప్రారంభించడానికి భవనాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాలలో పాఠశాల భవనాలలో సచివాలయాలను ప్రారంభించారు. దీంతో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో పాఠశాలలో ప్రారంభించిన సచివాలయాలను వెంటనే ఖాళీ చేసి అద్దె భవనాల్లోకి మార్చారు. అయితే ఆ అద్దెలను చెల్లించని స్థితిలో హిందూపురం పురపాలక సంఘం ఉంది. హిందూపురం పురపాలక సంఘంలో 43 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 9 సచివాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. 3వ వార్డు ఆర్టీసీ కాలనీ, 4వ వార్డు త్యాగరాజు నగర్‌, సడ్లపల్లి, సూగురు, మోతకుపల్లి, ఆజాద్‌ నగర్‌, అరవింద నగర్‌, అహ్మద్‌ నగర్‌, సింగిరెడ్డిపల్లి ప్రాంతాలలో ఉన్న సచివాలయాలు అద్దెనివాసాల్లో ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ కాలనీ నాల్గవ వార్డు సచివాలయానికి నాగరాజు తన భవానాన్ని అద్దెకు ఇచ్చాడు. అయితే ఆ భవనానికి నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని నాగరాజు సచివాలయానికి శుక్రవారం తాళం వేసి, భవనం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సచివాలయానికి సంబంధించి అద్దె చెల్లించాలని మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. దీంతో విధి లేని పరిస్థితిలో సచివాలయానికి తాళం వేశానన్నారు. చెల్లించాల్సిన అద్దె మొత్తం చెల్లించి సచివాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేయడంతో పురపాలక సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ యజమానిని వెంటనే పిలిపించి చెల్లించాల్సిన నాలుగు నెలల అద్దెకు సంబందించి రూ. 24వేలను చెక్కు రూపంలో అందించారు. అదే విధంగా ఈ సచివాలయంతో పాటు మిగిలిన సచివాలయాలకు ఇవ్వాల్సిన అద్దెలు మొత్తం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ చెక్కు రూపంలో అందరికీ అందించారు.

➡️