నిరుపేదల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం..?

Nov 24,2023 21:54

ధర్నాలో పాల్గొన్న నాయకులు, మహిళా రైతులు, తదితరులు

పెనుకొండ : నిరుపేదల పట్ల అటవీ శాఖ అధికారులకు నిర్లక్షం ప్రదర్శించడం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం. ఇంతియాజ్‌ అన్నారు. వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ రొద్దం మండలం కోగిర రెవెన్యూ పొలంలో 667, 668,669 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ మిగులు భూమిని కోగిర, శ్యాపురం, కంబాలపల్లి, బొక్సం పల్లి, బీదాను పల్లి గ్రామాలకు చెందిన దళిత, గిరిజన సాగుదారులు సాగు చేసుకుంటున్నారని అన్నారు. వీటిని అసైన్మెంట్‌ చేసి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని సంబందింత రెవిన్యూ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేశామని తెలిపారు.అధికారులు ఇది తమ పరిధి కాదని ఆ భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారన్నారు. దీంతో సమస్యను అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. బలహీన వర్గాలకు చెందిన భూమి లేని నిరుపేదలు ఈ భూమిలో కందులు, జొన్నలు, కొర్రల పంటలను సాగు చేస్తున్నారని తెలిపారు. అయితే అటవీశాఖ పేరు చెప్పి టింబక్ట్‌ సంస్థ పేదలను భయబ్రాంతులకు గురి చేస్తూ సాగు భూములకు అడ్డు పడుతోదంని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసంస్థపై స్థానిక పోలీస్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. పేదలు సాగులో ఉన్న భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయా లేవా అనే సమాచారం రాత పూర్వకంగా ఇవ్వాలని అక్టోబర్‌ 28న దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు అటవీశాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. అటవీశాఖ అధికారులకు పేదలంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌,జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, నారాయణ, గ్రామస్తులు అనిత, నరసింహులు, రామాంజనమ్మ, మారుతి, బాలునాయక్‌, అంజనప్ప, ఆటో యూనియన్‌ నాయకులు తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️