ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ పై భారత్‌లో ఎఫ్‌ఐఆర్‌

అమరావతి : వన్డే ప్రపంచకప్‌ పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ పై భారత్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. భారత్‌పై విజయం సాధించి వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సాధించిన వరల్డ్‌ కప్‌ పై మార్ష్‌ తన కాళ్ళను పెట్టి ఫొటో దిగారు. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. కీలక పోరులో ఆసీస్‌ ప్రదర్శించిన పోరాటపటిమను అంతా కొనియాడారు. కానీ… మిచెల్‌ మార్ష్‌ చేసిన పనితో ఆసీస్‌ తన పరువును తీసుకుందని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఆ ట్రోఫీని అవమానించడంతోపాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచారంటూ … ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన ఆర్‌టిఐ కార్యకర్త పండిట్‌ కేశవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ గేట్‌ పోలీసులు కేసును నమోదు చేశారు. మార్ష్‌ అలా చేయడం తీవ్రంగా బాధించింది: షమీమార్ష్‌ తీరుపై టీమిండియా సీనియర్‌ పేసర్‌ షమీ స్పందించారు. ” మిచెల్‌ అలా చేయడం నన్ను తీవ్రంగా బాధించింది. ఎన్నో జట్లు వరల్డ్‌ కప్‌లో ట్రోఫీ కోసం పోరాడాయి. అలాంటి ట్రోఫీని తలమీద పెట్టుకోవాలి. అలాకాకుండా కప్‌పై కాళ్లు పెట్టడం నచ్చలేదు ” అని షమీ అన్నారు. మిచెల్‌ అలా వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది.

➡️