విద్యార్థుల సంఖ్యపై గందరగోళం

Nov 24,2023 10:22 #AP Education, #students
  • ఒక్కోచోట ఒక్కో డేటా
  • వెల్లడించని విద్యాశాఖ
  • గోప్యత పాటిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై స్పష్టత ఉండటం లేదు. విద్యార్ధుల సంఖ్యను బహిర్గతం చేయాల్సిన పాఠశాల విద్యాశాఖ ఒక్కోచోట ఒక్కో విధంగా చెబుతోంది. అధికారికంగా మాత్రం ఎక్కడ పొందుపరచకపోవడంతో విద్యార్థుల సంఖ్యపై గందరగోళం ఏర్పడింది. ప్రతి ఏటా ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత పాఠశాలల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల సంఖ్యను యాజమాన్యాల వారీగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించాల్సి. ఈ ప్రక్రియ నాలుగేళ్ల క్రితం వరకు నడిచింది. తన అధికారిక వెబ్‌సైట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సిఎస్‌ఇ.ఎపి.జిఓవి.ఇన్‌) వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మొన్నటి వరకు వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పొందుపరచడం లేదు. ఇటీవల 2016-17 నుంచి 2020-21 విద్యాసంవత్సరం వరకు గణాంకాలను మాత్రమే పొందుపరిచింది. 2021-22, 2022-23, 2023-24 (ప్రస్తుతం విద్యాసంవత్సరం) గణాంకాలను ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ వివరాలపై విద్యాశాఖ గోపత్య పాటిస్తోంది. సమాచార హక్కు చట్టం కింద కోరినా వివరాలను అందించడం లేదు. మరోపక్క విద్యాశాఖ చెబుతున్న గణంకాలు, కేంద్ర విద్యాశాఖ వెబ్‌సైట్‌ యుడైస్‌ప్లస్‌లో పొందుపరుస్తున్న గణాంకాలకు పొంతన ఉండటం లేదు. 2020-21లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య యుడైస్‌ ప్లస్‌ ప్రకారం 45,39,282 మంది ఉంటే పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రం 44,57,441 మంది ఉన్నారు. జగనన్న విద్యాకానుక (జెవికె) కిట్లు మాత్రం 42,34,322 మందికి మాత్రమే ఇచ్చినట్లు సమగ్ర శిక్ష చెబుతోంది. 2021-22లో యుడైస్‌ లెక్కల ప్రకారం 45,89,691 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం వివరాలను ఇప్పటివరకు విడుదల చేయలేదు. 2022-23 విద్యాసంవత్సరం వివరాలను రాష్ట్ర విద్యాశాఖతోపాటు కేంద్ర విద్యాశాఖ కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల సంఖ్య 2022-23 విద్యాసంవత్సరంలో తగ్గిపోయిందని గతేడాది పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో అప్పటి పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బి రాజశేఖర్‌ 2022-23 విద్యాసంవత్సరం వివరాలతో పాటు 2021-22 వివరాలను కూడా వెల్లడించారు. ఆ ప్రకారం 2021-22లో 44,29,356 మంది ఉన్నారని ప్రకటించారు. జెవికె కిట్లు 45,71,051 మందికి ఇచ్చినట్లు సమగ్ర శిక్ష చెబుతోంది. 2022-23 విద్యాసంవత్సరంలో 40,31,239 మంది విద్యార్థులు చదువుతున్నారని కూడా ఇదే సమయంలో రాజశేఖర్‌ చెప్పారు. కిట్లు మాత్రం 41,03,155 మంది విద్యార్ధులకు సరఫరా చేసినట్లు సమగ్ర శిక్ష లెక్కలు చెబుతోంది.

➡️