మిర్చి రైతుకు నష్టాల ఘాటు

Nov 24,2023 09:52 #guntur yard, #mirchi farmers
  • కొత్త సరుకు రాగానే ధర రూ.3 వేల తగ్గింపు
  • గుంటూరు యార్డులో వ్యాపారుల మాయాజాలం

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : మిర్చి రైతును నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుంటూరు మిర్చి యార్డుకు కొత్త సరుకు రావడం ప్రారంభమవడంతో గత వారం రోజుల వ్యవధిలో క్వింటాలుకు రూ. 2,000 నుంచి రూ.3 వేల వరకు ధరలను వ్యాపారులు తగ్గించేశారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డులో నాన్‌ ఎసి సాధారణ రకాలు, స్పెషల్‌ వెరయిటీల కనిష్ట సగటు ధర క్వింటాలు రూ.8,500కే పరిమితం అయ్యాయి. గరిష్ట సగటు ధర రూ.24 వేలు ఉంది. కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న సరకుకు కూడా దాదాపు ఇవే ధరలు లభించాయి. మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉండే తేజ, బాడిగ రకాలు గరిష్టంగా రూ.24 వేలు పలికాయి. గత వారం కనిష్ట ధర రూ.11 వేలు, గరిష్ట ధర రూ.25 వేల వరకూ లభించింది. ప్రస్తుతం అన్ని వెరయిటీల ధరలు క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తగ్గాయి. ఈ తగ్గుదల మరింత కాలం కొనసాగే సూచనలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త సరుకులో తేమ 20 శాతం వరకు ఉంటుందని, అందువల్ల ధరలు కొంత తగ్గినమాట వాస్తవమేనని వారు సమర్థించుకుంటు న్నారు. ప్రస్తుతం కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న మిరప కాయల కన్నా కొత్త కాయల కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో మిర్చి గిరాకీ ఉండడం వల్ల మెట్ట ప్రాంతంలోని రైతులు ఎక్కువమంది దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఏటా ఆరు లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఈ ఏడాది వర్షాభావం వల్ల దాదాపు ఐదు లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు దాదాపు లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు. వాతావరణం సహకరించి సాగునీటి వసతి ఉంటే ఎకరాకు గరిష్టంగా 30 క్వింటాళ్ల దిగుబడి సాధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గరిష్టంగా పది క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వర్షాభావం వల్ల సాగు నీరు విడుదల కాక సాగర్‌ ఆయకట్టు పరిధిలో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. రాయలసీమ, ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో ఈ ఏడాది 83 శాతం విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. రాయలసీమ ప్రాంతంలో బోర్ల ద్వారా ఎక్కువగా సాగు చేసిన ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. గుంటూరు మార్చి యార్డుకు కొత్త సరుకు వస్తుండడంతో వ్యాపారులు ధరలను తగ్గించడం ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లో మిర్చి ఈ ఏడాది ఎక్కువగా సాగయిందని, ఈ దృష్ట్యా ధరల్లో వ్యత్యాసాలు ఉరటాయని, సీజన్‌లో రూ.15 వేల కంటే ధర తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.

➡️