ముస్లింల జీవితాలను మార్చేందుకు తన హయాంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశామని నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా చెప్పుకున్నారు. ఈ నెల 23న షాదీ తోఫా ప్రకటించారు. అయితే ఆయన పాలనలో రూపొందించిన మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. తనకు అధికారం ఇస్తే ముస్లింలకు అనేక కానుకలు ఇస్తానని ప్రధాన ప్రతిపక్ష నేత మరోసారి చెబుతున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ముస్లింల జీవితాలను మార్చలేవని అనుభవం నేర్పుతున్నది. అయినా ఈ పార్టీలు మరలా అలాంటి హామీలే ఇస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో 11.5 శాతం మంది మైనారిటీలు ఉన్నారు. అందులో 10 శాతం మంది ముస్లిం మైనారిటీలు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన పూర్తయితే ఈ సంఖ్య మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమం, వైద్యం తదితర రంగాలన్నిటిలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. దేశంలో 30 కోట్ల మంది ఉన్న ముస్లింలలో ఇప్పటికీ 43 శాతం మంది నిరక్షరాస్యులు, డిగ్రీ ఆపైన చదువుకున్న వారు కేవలం 6.96 శాతం. ఐఎఎస్ లలో 3, ఐఎఫ్‌ఎస్ లలో1.8, ఐపిఎస్ లలో 4, రైల్వే ఉద్యోగాల్లో 4.5, పోలీసు శాఖలో 6 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. ఈ నాటికీ బాలకార్మికుల్లో 40 శాతం మంది ముస్లిం పిల్లలు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆర్థమవుతుంది. ఎన్నికల సందర్భంగా ముస్లింల ఓట్లను గంపగుత్తుగా కొల్లగొట్టేందుకు పాలక పార్టీల నాయకులు మసీదులకు వెళ్లడం, టోపీలు ధరించడం లాంటి విన్యాసాలు చేసేందుకు పోటీలు పడతారు. అనేక హామీలు ఇవ్వడం ఆ తరువాత వాటిని అమలు చేయకపోవడం పాలక పార్టీలకు అలవాటుగా మారింది. కేంద్రంలోని బిజెపి మతం ఆధారంగా ముస్లింలను వేరు చేసి, ప్రజల మధ్య శతృత్వాన్ని నూరిపోసి రాజకీయ లబ్ధి పొందేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఒకవైపు అమలుకాని హామీలు, మరోవైపు విద్వేష ఘర్షణలు ముస్లింల జీవితాలను మరింతగా దిగజారుస్తున్నాయి. ముస్లింల జీవితాలను మార్చేందుకు తన హయాంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశామని నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా చెప్పుకున్నారు. ఈ నెల 23న షాదీ తోఫా ప్రకటించారు. అయితే ఆయన పాలనలో రూపొందించిన మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. తనకు అధికారం ఇస్తే ముస్లింలకు అనేక కానుకలు ఇస్తానని ప్రధాన ప్రతిపక్ష నేత మరోసారి చెబుతున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ముస్లింల జీవితాలను మార్చలేవని అనుభవం నేర్పుతున్నది. అయినా ఈ పార్టీలు మరలా అలాంటి హామీలే ఇస్తున్నాయి. అమలుకు నోచుకోని మైనారిటీ సబ్‌ప్లాన్‌ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కాంపొనెంట్ యాక్ట్-2022ను ప్రభుత్వం 2022 ఏప్రిల్ 20న ప్రకటించింది. రానున్న పది సంవత్సరాల్లో మైనారిటీల అభివృద్ధి, సామాజిక గౌరవం కోసం వారి జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని ఇందులో చెప్పారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల కోసం పది శాతం నిధులు కేటాయించాలి. ఈ సంవత్సరం మన రాష్ట్ర బడ్జెట్ రూ.2,79,279.27 కోట్లు. ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి మరియు మైనారిటీల సంక్షేమానికిగాను మొత్తానికి కలిపి కేటాయించినది రూ. 51,292 కోట్లు. మైనారిటీల సంక్షేమానికి 2020-23 బడ్జెట్‌లో రూ. 1330 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.750 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గతం కంటే 44 శాతం తగ్గించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి 23 వేల కోట్లు మైనారిటీల కోసం ఖర్చు చేశామని చెప్పింది ప్రత్యేకంగా మైనారిటీల కోసం చేసింది కాదు. అందరికీ అమలవుతున్న నవరత్నాల్లో భాగంగా ముస్లింలకు అందుతున్న సంక్షేమ పథకాల లెక్కలు వేరు చేసి చెబుతున్నారు. ఉదా: 2022-23 సంవత్సరంలో (2022 డిసెంబర్ వరకు చేసిన ఖర్చు) జగనన్న విద్యా దీవెన పథకం కింద 66,459 మంది మైనారిటీలకు రూ.130.96 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.67.79 కోట్లు, జగనన్న అమ్మఒడి కింద రూ.90.70 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్ర రూ.4.92 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కింద రూ.549 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ.82 కోట్లు నిధులు మైనారిటీ పేదలకు ఇచ్చినట్లు చెబుతున్నారు. వాస్తవంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.11 లక్షల కోట్లు. మైనారిటీలకు అమలైన అన్ని రకాల సంక్షేమ పథకాలకు కలిపి చూసినట్లయితే వారికి అందింది రూ.23 వేల కోట్లు. అంటే కేవలం 2 శాతం నిధులు మాత్రమే. జనాభా ప్రకారం పది శాతం నిధులు కేటాయించి వుంటే లక్ష పదివేల కోట్లు ఖర్చు చేయాల్సివుండేది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాది మైనారిటీ కార్పొరేషన్‌కు రూ. 84 కోట్లు కేటాయించి అమలు చేయలేదు. దుల్హన్ పథకం (పేద ముస్లింల పెళ్ళి సహాయం) 48,693 మందికి అందాల్సిన సహాయాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసింది. చివరకు 2022లో హైకోర్టు జోక్యం చేసుకుంటే వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో 2,200 మందికి సహాయం చేశారు. ఈ నెల 23న మరోసారి ఈ తోఫా ప్రకటించారు. రంజాన్ తోఫాకు కేవలం రూ.1.6 కోట్లు అంటే సగటున రెండు వందల రూపాయలు ఇచ్చి పండుగ చేసుకోమంటున్నారు.మైనారిటీ సబ్‌ప్లాన్ ప్రకారం పది శాతం నిధుల కేటాయించి ఖర్చు చేసి వుంటే ముస్లింల పరిస్థితి ఖచ్చితంగా మెరుగ్గా వుండేది. రాష్ట్రంలో స్వల్ప ఆదాయం వచ్చే వారిలో 62 శాతం మంది ముస్లింలే ఉన్నారు. వీరు ఎక్కువ భాగం పట్టణాల్లో, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ మెకానిక్‌లుగా, మోటార్ కార్మికులుగా, తోపుడబండ్ల వ్యాపారులుగా, ఇంటిపనివారుగా, దర్జీలుగా, హోటల్, బీడీ కార్మికులుగా అసంఘటితంగా జీవిస్తున్నారు. వచ్చే ఆదాయం తక్కువ కావడంతో సహజంగానే విద్య, వైద్యం కొనగలిగే శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే ముస్లింలలో నిరక్షరాస్యత, దారిద్య్రం ఎక్కువగా వుంటుంది. ఈ సమస్యలను నిర్మూలించకుండా ముస్లింల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? తన క్యాబినెట్‌లో రెండుసార్లు మైనారిటీ వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చానని ముఖ్యమంత్రి చెప్పుకోవడం రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి తన పాలనాకాలంలో అమలు చేయలేదు. నాడూ మంత్రి పదవులు, స్పీకర్ పోస్టుల గురించి గొప్పలు చెప్పుకున్నారు. కొందరికి వచ్చే ఈ పదవుల వల్ల ఆయా తరగతుల్లోని ప్రజలు ఎలా అభివృద్ధి అవుతారో ఏలినవారికే ఎరుక మైనారిటీల పరిస్థితులపై కమిషన్లుదేశంలో మైనారిటీల పరిస్థితులపై ప్రభుత్వాలు వివిధ కమిషన్లను ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్లన్నీ మైనారిటీలు అందులో ముస్లింల పరిస్థితుల గురించి ఆశ్చర్యపోయే నివేదికలు ఇచ్చాయి. ముస్లింలు విద్యా, ఉపాధి రంగాల్లో బాగా వెనుకబడ్డారని, వీరి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని 1983లో కేంద్ర ప్రభుత్వం నియమించిన గోపాల్‌సింగ్ కమిషన్ సిఫారస్సు చేసింది. వీరితో పాటు బౌద్ధుల గురించి చెప్పింది. బౌద్ధులను మాత్రం షెడ్యూలు కులాల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలకు 15 సూత్రాల పథకాన్ని ప్రకటించి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది. 2004లో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మైనారిటీ మతాలకు చెందిన ప్రజల స్థితిగతులపై జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ మరియు రంగనాథ్ మిశ్రా కమిటీలను నియమించింది. ఈ కమిటీలు దేశమంతటా విస్తృతంగా పర్యటించి ”ముస్లింలు సగటు పౌరుల కంటే అన్ని రంగాల్లోనూ తీవ్రంగా వెనుకబడినారు. కొన్ని అంశాల్లో దళితుల కంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సంక్షేమ పథకాల్లో, ప్రభుత్వ పథకాల్లో ముస్లింలకు అందాల్సిన వాటా ప్రకారం వీరికి అందడంలేదు” అని స్పష్టంగా నివేదించాయి. 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ముస్లిం మహిళల్లో నిరక్షరాస్యులు ఎక్కువని, బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీరిలో స్వంత వ్యవసాయ భూమి లేని వారు అత్యధికులని చెప్పింది. ఈ స్థితి నుండి వారిని అభివృద్ధి చేయడానికి ముస్లిం మైనారిటీలకు 10 శాతం ఇతర మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రభ్వుత్వ సంక్షేమ పథకాల్లో వీరి వాటాకు తగ్గట్టుగా పొందేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. అన్ని రంగాల్లో అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లింలను ప్రస్తుత కేంద్రం బిజెపి ప్రభుత్వం శత్రువులుగా ప్రచారం చేస్తూ వారిని మరింత వెనుకబాటుకు గురిచేస్తున్నది.రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చినా అమలు చేయలేదు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలన తర్వాత 2022లో మైనారిటీ సబ్‌ప్లాన్ చట్టం చేసి దాని అమలుకు అవసరమైన నిధులు కేటాయించడంలేదు. కొంతమంది ముస్లిం నాయకులకు పదవులు ఇచ్చి అత్యధికమంది ముస్లింల అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా సాధికారికత సాధించేశామంటున్నారు. రాష్ట్రంలో అధ్యాపకులు లేక ఉర్దూ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఉన్న కొద్దిపాటి మైనారిటీ విద్యాలయాలు తీవ్రమైన అసౌకర్యాల మధ్య మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. యునానీ వైద్య కళాశాలలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వక్ఫ్ భూములు 65,773.63 ఎకరాలు ఉండగా అందులో 36 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూములను ఆక్రమించుకున్న వారిలో అత్యధికులు రాజకీయ నాయకులు. వారి నుండి ఆ భూములను స్వాధీనం చేసుకుని పేద ముస్లింల అభివృద్ధికి ఉపయోగించవచ్చు. అలాంటి చర్యలు తీసుకోవడానికి గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులను, పౌరసత్వ చట్టాలను, విద్వేష ప్రచారాలను వ్యతిరేకించకపోగా పార్లమెంట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్నాయి. ముస్లింల ఉపాధిని దెబ్బ తీస్తున్న ప్రభుత్వ విధానాలుప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు పేదలను మరింత పేదలుగా మారుస్తున్నాయి. ఈ విధానాలు అత్యధికమంది ముస్లింలు జీవిస్తున్న అనేక స్వయం ఉపాధి వృత్తులను ధ్వంసం చేస్తున్నాయి. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అవుతున్నాయి. పట్టణాల్లో ముస్లింల జీవనోపాధిగా ఉన్న మెకానిక్, దర్జీ పనులు, బీడీ, ఆటో లాంటి వృత్తులు కుదించుకుపోతున్నాయి. కార్పొరేట్ మాల్స్ రావడంతో చిన్న వ్యాపారాలు, తోపుడుబండ్లపై ఆధారపడిన ముస్లిం కుటుంబాల బతుకులు దుర్భరంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాలు లేక ముస్లింలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్య, వైద్యం, అభివృద్ధి అనేది ముస్లింల సామాజిక చైతన్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు సంఘటితం కావడం ఆవశ్యకం.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/వి. రాంభూపాల్