ప్రజశక్తి – చీరాల
రైల్వే రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎం వసంతరావు మాట్లాడుతూ భారతీయ రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిదని అన్నారు. కోట్లాది ప్రజలకు జీవనంలో ఒక భాగం అన్నారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తు సాధారణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తుంది రైల్వే రంగాన్ని స్వదేశీ, విదేశీ ప్రైవేటు కార్పొరేటు వ్యక్తులకు మోడీ నైవేద్యంగా ఇవ్వడాన్ని వ్యతిరేకించాలని కోరారు. ప్రజల సొమ్ముతో వేసిన రైల్వే లైను ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా ప్రైవేటు కంపెనీలు యదేచుగా వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో రైలు ప్రయాణాలను కూడా ధనవంతుల కోసమనే విధంగా మార్చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు అందుబాటులో ఉన్న చౌకైన రైలు ప్రయాణం కూడా భారం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, నాయకులు ఎల్ జయరాజు, కె ఆంజనేయులు, జి సురేష్, ఐవి ప్రసాద్, చక్రపాణి పాల్గొన్నారు.