నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో కళ్యాణమస్తు, షాదీతోఫా కింద 565 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.3.32 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు జూలై-సెప్టెంబరు మధ్య వివాహమైన వారికి ఈ లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. వికలాంగులకు రూ.1.50 లక్షలు, ఎస్సి, ఎస్టిలకు రూ.లక్ష, బిసిలకు రూ.50 వేల ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనతో పాటు పిల్లల చదువులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై.విశ్వమోహన్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ అధికారి అనురాధ, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.