ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) దేశంలో రిజర్వేషన్లను అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎ.వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1015వ రోజుకు చేరాయి. దీక్షల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఇఆర్‌ఎస్, ఇఎస్ అండ్ ఎఫ్ కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రిజర్వేషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి సరైన ఉపాధి కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉన్న 88 శాతం ప్రజలు తిరగబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ఉండవల్లి శ్రీనివాస్, విభాగాల ప్రతినిధులు గంగాధర్, నీలకంఠం, గోవిందు, బి రాము, గణేష్, తదితరులు పాల్గొన్నారు.