వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో పథకం డబ్బులను విడుదల చేశారు.. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని గురువారం రిలీజ్‌ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. ఈ దఫాలో 10,511 జంటలకు సంబంధించిన రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని.. వధువుల తల్లుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందించడం సంతోషకరమని, ఇప్పటివరకూ మూడు పర్యాయాలు కళ్యాణమస్తు, షాదీ తోఫా అందించామని తెలిపారు. పేదింటి పిల్లలు విద్యావంతులు కావాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకానికి 10వ తరగతి అర్హతలు పెట్టాం.. దీంతో బాల్య వివాహాలు తగ్గుతాయని తెలిపారు.. పేదలందరికీ విద్య అందించడంలో భాగంగా విద్యాసంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలంతా ఉన్నత విద్య వైపునకు వెళ్లడానికే మోటివేషన్‌ చేయడం ఈ పథకం లక్ష్యంగా చెప్పుకొచ్చారు.. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం, బీసీ కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. జూలై- అక్టోబర్‌, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు లబ్ధి చేకూరగా.. 81.64 కోట్ల రూపాయలను వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అందించిన మొత్తం సాయం 349 కోట్ల రూపాయలు కాగా.. 46 వేల మందికి లబ్ధి పొందారు.

➡️