పొదుపును, రుణ పరిమితిని పెంచుకోవాలి
జిల్లా సహకార శాఖాధికారి ఎం.వెంకట సుబ్బయ్య
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
సంఘ సభ్యులు తమ పొదుపును, ఋణ పరిమితిని పెంచుకోవాలని జిల్లా సహకార శాఖాధికారి వెంకట సుబ్బయ్య సూచించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డులో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సహకార శాఖాధికారి యం. వెంకట సుబ్బయ్య, నంద్యాల జిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్ అధికారి జి.వెంకటక్రిష్ణయ్య హాజరై మాట్లాడారు. గతంలో ప్రతి ఒక్క సభ్యురాలు చేస్తున్న పొదుపు 100 రూపాయల నుండి 200లకు పెంచుకోవాలని సూచించారు. అనంతరం సంఘం చైర్మన్ శిల్పా నాగిని రవిసింగా రెడ్డి మాట్లాడుతూ 2010 సంవత్సరం నంద్యాల పట్టణంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ స్థాపించి నిరంతరంగా నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. సహకార బ్యాంక్‌లో 13 వేల మంది మహిళలు ఖాతాదారులుగా ఉన్నారని, వీరికి ఇప్పటికి రూ. 22 కోట్ల రుణాలను పంపిణీ చేశామన్నారు. మహిళలు ఆర్థికంగా బలోవేతం కావాలని, చదువుకోవాలని అపుడే సమాజం, దేశం పురోభివృద్ధి సాధిస్తుందని తన మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి చెప్పిన విధంగా నేటికి వారి ఆశయాలకు అనుగుణంగా, సూర్తిగా తీసుకొని మహిళలకు రుణాలను అందజేస్తున్నామన్నారు. రుణాలను అందించడమే కాకుండా ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అయినా వాటిని లెక్కచేయక పేదల కోసం కష్టనష్టాలకు ఓర్చి శిల్పామహిళా సహకార బ్యాంకును కొనసాగిస్తున్నామని తెలిపారు. అనంతరం 16 లక్షల రూపాయలు సభ్యులకు రుణాలుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరక్టర్ పూర్ణిమ, మేనేజరు జి.హరిలీల, యూనియన్ ప్రతినిధి ఎన్.నరసింహా రెడ్డి, సిబ్బంది, సంఘ సభ్యులు పాల్గొన్నారు.