సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు మేలు చేయాలని సంకల్పిస్తే సచివాలయ ఉద్యోగుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని
  • సేవలందక ఇక్కట్లు పడుతున్న ప్రజలు
  • కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు
  • ప్రజాశక్తి- ఆమదాలవలస

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు మేలు చేయాలని సంకల్పిస్తే సచివాలయ ఉద్యోగుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు వాపోతున్నారు. మండలంలోని బెలమాం గ్రామ పంచాయతీలో ఉన్న సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వలన బెలమాం, లొద్దలపేట గ్రామ ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. ఈ సచివాలయం మండల కేంద్రానికి నాగావళి నది అవతల వైపు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకుండా వారికి తీరిక వేళల్లో వచ్చి ముఖం చూపెడుతూ వెళ్లిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శి సెలవులో ఉండడంతో దూసి డిడిఒకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ పట్టించుకోకపోవడంతో వీరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా విధులను నిర్వహిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. సచివాలయాలు వచ్చాక గ్రామంలోనే తమ పనులు సులభంగా పూర్తవుతాయని అనుకున్నామని, నేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు సచివాలయ ఉద్యోగుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సచివాలయం ద్వారా సక్రమంగా ప్రజల పనులు పూర్తయ్యేటట్లు దృష్టి సారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

➡️