మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

ప్రజాశక్తి-మదనపల్లె బల్లి పడిన మధ్యాహ్నం భోజనం తిని 64 మంది విద్యార్థులు అస్వ స్థతకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం టేకులపాలెం ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనంలో బల్లి పడ్డ ఆహారాన్ని తిన్న 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు విషయాన్ని గుర్తించిన వెంటనే తమ పిల్లలను తమ తమ వాహనాలు, ప్రయివేటు వాహనాలలో విద్యార్థులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. సంఘటన సమాచారం అందుకున్న మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌బాషా జిల్లా ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనపై విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థికి తాను తింటున్న అన్నంలో బల్లి రావడంతో భయపడి తెలియజేశాడు. ఇది గుర్తించిన పాఠశాల సిబ్బంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు, భోజనం తిన్న విద్యార్థులు అందరిని ప్రయివేట్‌ వాహనాలలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఎవరికి ఎలాంటి హాని జరగలేదని, ప్రస్తుతం వీరందరూ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారని సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న మదనపల్లి ఆర్‌డిఒ మురళి ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మదనపల్లి డిఎస్‌పి కేసప్ప ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి వారి తల్లిదండ్రుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మదనపల్లి పట్టణ అధ్యక్షులు రెడ్డి సాహెబ్‌ పరామర్శించారు.

➡️