ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో రైతులు తాము పండించిన పంటలను ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకొనేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యం నిల్వ ఉంచుకొనేవాళ్లు.. ఇందుకు రైతుబంధు పథకం కొంత మేర రైతులకు ఉపయోగకరంగా ఉండేది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు పథకం సామాన్య రైతులకు అందని పరిస్థితి ఏర్పడింది. రైతుల అవసరాలకు సరిపడా గోదాములు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీలో సాధారణంగా రెండున్నర లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో ఒక్క వరి పైరు వరకు రెండు సీజన్లలో కలపి లక్షా 20 వేల హెక్టార్ల వరకు సాగవుతుంది. ధాన్యం దిగుబడి వచ్చి పంట నూర్పిడి జరిగే డిసెంబర్ నాటికి ధాన్యం ధర చాలా తక్కువగా ఉంటుంది. గత ఖరీఫ్ కోతల నాటికి బిపిటి రకం 75 కిలోల ధాన్యం ధర రూ.1300గా ఉంది. ఇప్పుడు అదే ధాన్యం ధర రూ.2700 వరకు ఉంది. రైతుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులు బ్యాంకుల నుంచి సక్రమంగా పంట రుణాలు వచ్చే పరిస్థితులు లేనందున రైతులు ఎరువుల షాపుల యజమానులు లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పు తెచ్చి పంటల సాగు చేస్తున్నారు. పంటల సాగుకు తెచ్చిన అప్పుల కారణంగా రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. గతంలో అమలులో ఉన్న రైతు బంధు పథకం ద్వారా ధాన్యాన్ని గోదాముల్లో పెట్టుకొని రైతులకు ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చేవారు. ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు రుణం అందేది. రైతులు ఈ రుణంతో పంటల సాగు కోసం తెచ్చిన అప్పులను ముందుగా తీర్చుకొని ధాన్యానికి మంచి ధర పలికే సమయంలో అమ్ముకునే వారు. కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచుకునే అవకాశం ఉండటం లేదు. రైతులు ఎవరైనా రైతుబంధు పథకం ద్వారా తమ ధాన్యాన్ని గోదాముల్లో ఉంచి రుణం పొందుదామంటే అవి మంజూరు కావడం లేదు. ధాన్యం నిల్వ ఉంచి రుణం పొందేందుకు కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారానే రాష్టప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కానీ మార్కెట్ కమిటీలకు సిఎఫ్ఎంఎస్ ద్వారా రుణ మొత్తాలు రావడం లేదు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని గోదాముల్లో ఉంచి రుణం పొందే వీలులేకపోతోంది. ఎలాంటి రుణం అందకపోయినా ఆర్థిక స్తోమత ఉన్న పెద్ద రైతులు, రైతుల పేరుతో వ్యాపారులు గోదాముల్లో ధాన్యం ఉంచుకొని ధర ఉన్నప్పుడు బయటకు తెచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.జిల్లాలో బాపట్ల, చీరాల, అద్దంకి, సంతమాగులూరు, పర్చూరు, వేమూరు, రేపల్లె, కూచినపూడిల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములు ఉన్నాయి. ఈ గోదాముల సామర్ధ్యం 66 వేల మెట్రిక్ టన్నులుగా చెబుతున్నారు. కానీ జిల్లాలో ఒక్క ఖరీఫ్‌లోనే రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా 74 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొననున్నట్లు ప్రకటించారు. అంటే రైతులు తాము పండించిన పంటను వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలంటే ఉన్న నిల్వ సామర్ధ్యం ఏమాత్రం సరిపోదని తెలుస్తోంది. జిల్లాలో గోదాములు ఖాళీగా లేవని చెబుతున్నారు. అన్నింటిలోనూ ధాన్యం లేదా ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం సామాగ్రి ఉన్నాయి. ఈ కారణంగా రైతులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునే వీలు ఉండటం లేదు. గోదాములు, రైతుబంధు పథకం అందుబాటులో లేక రైతులు తక్కువ ధరలకే ధాన్యం విక్రయించి నష్టపోతున్నారు. జిల్లాలో ఉన్న ఎనిమిది మార్కెట్‌యార్డులకు అనుబంధంగా నూతనంగా కొత్త గోదాములు నిర్మించాలన్న ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. రైతుల అవసరాలకు అనుగుణంగా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు ద్వారా తక్షణమే రుణాలు విడుదల చేయాలని, జిల్లాలోని రైతాంగ అవసరాలకు అనుగుణంగా నూతన గోదాములు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.