అదానీ సేవలో…

Nov 22,2023 07:09 #Editorial, #prajasakti

  రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సముద్ర తీరంలోని అత్యంత విలువైన బీచ్‌శాండ్‌ మైనింగ్‌ను అదానీ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నించడం దారుణం. టైటానియమ్‌ డై ఆక్సైడ్‌, ఇల్మినైట్‌, రూటైల్‌, గార్నెట్‌, సిలిమనైట్‌, లూకోజిన్‌ వంటి అరుదైన మూలకాలు బీచ్‌శాండ్‌లో ఉంటాయి. అణుధార్మిక స్వభావాన్ని కలిగివుండేవి దేశ భద్రతకు కూడా కీలకమైనవి. ఆ కారణంగానే ఆఫ్‌షోర్‌ మినరల్‌ మైనింగ్‌లో ప్రైవేటు రంగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో చట్ట సవరణ చేసింది. కాని, అదే మోడీ సర్కారు నాలుగేళ్లు తిరగ్గానే యూ టర్న్‌ తీసుకుని ఆ మైనింగ్‌కు ప్రైవేటు రంగాన్ని అనుమతించాలంటూ ఈ ఏడాది మే 25న ముసాయిదా విడుదల చేయడం, చకచకా చట్ట సవరణకు బిల్లు ప్రతిపాదించడం వెనుక కార్పొరేట్ల సేవ తప్ప వేరే ప్రయోజనమేదీ కనిపించదు. ప్రతిపక్ష సభ్యులంతా మణిపూర్‌ దారుణాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్న సమయంలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వ ‘కార్పొరేట్‌ సేవా తత్పరత’కు నిదర్శనం.
కార్పొరేట్లు అందునా అదానీ ఆదేశాలకు కేంద్రం ఎంతలా శిరసావహిస్తోందో అర్ధం చేసుకోవడానికి ఈ చట్ట సవరణ తతంగం ఓ మచ్చు తునక. బీచ్‌శాండ్‌ మైనింగ్‌ కోసం రెండు సంస్థలను (ఒకటి ఎ.పి లో, మరొకటి ఒడిషాలో) ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్‌ 14, 27 తేదీల్లో బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌కి అదానీ గ్రూపు లేఖ రాసిన నెల రోజులకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ముసాయిదా విడుదల చేయడం గమనార్హం. అంతేగాక బీచ్‌శాండ్‌ నిర్వచనాన్ని మార్చడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఖనిజాలను ‘అణు మూలకాల’ జాబితా నుండి తొలగించడానికి కసరత్తు చేస్తోంది. ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ పరిధిలోకి 12 రకాల ఖనిజాలను తీసుకురావడంతో పాటు గతంలో ఉన్న నాలుగేళ్ల గడువును 50 సంవత్సరాలకు పెంచి లీజుకు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదించడం కార్పొరేట్లకు సాష్టాంగ పడడమే! మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం ఖనిజాలను ఎ.బి.సి అనే మూడు రకాలుగా విభజిస్తోంది. పార్ట్‌ బి లో ఆటమిక్‌ మినరల్స్‌ ఉంటాయి. తాజాగా మోడీ ప్రభుత్వం పార్ట్‌ బి నుండి కొన్ని ఖనిజాలతో డి గ్రూపును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ‘క్రిటికల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మినరల్స్‌’ పేరిట ఏర్పాటు చేయనున్న ఈ గ్రూపులో మొత్తం ఎనిమిది ఖనిజాలూ అదానీ గ్రూపు ఆసక్తి చూపినవే కావడం మరో నిదర్శనం. ఆఫ్‌షోర్‌ మైనింగ్‌ చట్ట సవరణలు రాష్ట్రాల హక్కులను తీవ్రంగా దెబ్బ తీస్తాయి. దేశ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇటువంటి బిల్లులను వ్యతిరేకించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. గతంలో మన రాష్ట్రానికి అటువంటి గొప్ప చరిత్ర ఉంది. కాని, వైసిపి ఆ బిల్లుకు మద్దతు తెలపడం, టిడిపి కూడా అదేబాటన వెళ్లడం మన రాష్ట్ర ప్రయోజనాలకు హానికరం.
సాధారణ పారిశ్రామికవేత్తలు కలిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ వచ్చేస్తోందన్నట్టు ప్రకటనలు జారీ చేసే సిఎం కార్యాలయం…ఇటీవల గౌతమ్‌ అదానీ ముఖ్యమంత్రితో భేటీ అయిన సంగతి మాట మాత్రంగానైనా వెల్లడించకపోవడంపై అప్పుడే పలు అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్రంలోని బీచ్‌ శాండ్‌ మైన్స్‌లో ‘ప్రాజెక్టు డెవలపర్‌ కమ్‌ ఆపరేటర్‌’ పేరిట 92 శాతం వాటాను ఆఫర్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచారన్న ఆరోపణలు సత్యదూరం కాదు. ఇప్పటికే రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ పరమైనాయి. విశాఖ నగరంలో విలువైన స్థలాలు ఐటి అభివృద్ధి పేరిట అప్పగించారు. పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ అంటూ రాయలసీమ జిల్లాల్లోను, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను తుంగలో తొక్కి వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ కూడా తోడైతే బంగాళాఖాతం తీరం నుండి తూర్పు కనుమల వరకు రాష్ట్రంలో అన్నిటా అదానీ సామ్రాజ్యం మరింతగా విస్తరిస్తుంది. అదానీ సేవలో తరించిపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్‌ అనుకూల విధానాలను జనం ప్రతిఘటించాలి. ప్రజల సంపదను ప్రజలే కాపాడుకోవాలి. అందుకు సమైక్య, సంఘటిత ఉద్యమాలు, పోరాటాలు సాగాలి.

➡️