రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 19,2023 22:05 #road accident
  • ప్రధాని భద్రతా విధులకు వెళ్తున్న ఆరుగురు పోలీసులు మృతి

జైపూర్‌ : ప్రధాని మోడీ భద్రతా విధుల కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని జుంజునులో ప్రధాని ఎన్నికల సభకు వెళ్తుండగా, చురు జిల్లా సుజన్‌గఢ్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సుజనఘర్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ (సిఒ) షకీల్‌ ఖాన్‌ కథనం ప్రకారం… నాగౌర్‌లోని ఖిన్‌వ్సర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఆరుగురు, మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఒకరు ప్రధాని ఎన్నికల సమావేశానికి కారులో జుంజును బయల్దేరారు. సుజన్‌గఢ్‌ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కనోటా చెక్‌పోస్ట్‌ సమీపంలో జాతీయ రహదారి-58పై అకస్మాత్తుగా ఓ జంతువు (నీల్‌గారు) వాహనం ముందుకు రావడంతో దాన్ని తప్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఆగివున్న ట్రక్కును ఢకొీట్టాడు. దీంతో, వాహనం ముందు భాగం పూర్తిగా ఛిద్రమై ముక్కలైంది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖిన్‌సర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎఎస్‌ఐ రామచంద్ర, కానిస్టేబుళ్ల కుంభారం, సురేష్‌ మీనా, తానారామ్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ మహేంద్ర అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కానిస్టేబుల్‌ సుఖరామ్‌ను, మరో కానిస్టేబుల్‌ను జోధ్‌పూర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా, సుఖ్‌రామ్‌ మార్గం మధ్యలోనే మరణించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, డిజిపి ఉమేష్‌ మిశ్రా విచారం వ్యక్తం చేశారు.

➡️