పదవీ విరమణ తర్వాత..

Nov 19,2023 12:01 #Sneha

కృషి.. పట్టుదల.. అకుంఠిత దీక్ష.. సాధిస్తామనే నమ్మకం ఉంటే ఏ వయస్సులోనైనా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అదే 69 ఏళ్ల దిగ్గజం ఐరేని మురళీధర్‌గౌడ్‌ నిరూపించారు. ఉద్యోగ విరమణ తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుండా, ఆసక్తి ఉన్న వెండితెరపై నటిస్తూ హిట్‌ టాక్‌ అందుకుంటున్నారు. నేటి యువతకు ఆయన జీవితం ఓ దిక్సూచి. కళపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నా, ఆరు దశాబ్దాలు బిగబట్టి ఉన్నారు. అవకాశాల కోసం ఓపిగ్గా ఎదురుచూశారు. చివరకు అనుకున్నది సాధిస్తూ నేటి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటుడుగా పేరు సంపాదించారు. ప్రతిభ ఉంటే చాలనీ, వయస్సుతో నిమిత్తం లేదని ఆచరణలో రుజువు చేశారు.
నేరుగా సినిమాల్లో అవకాశాలు రాని చాలామంది ముందుగా సీరియళ్లు..టీవీ షోలతో కెరీర్‌ను ప్రారంభించి అటుపై సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా బిజీగా మారుతున్నారు. అలాంటివారిలో మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఐరేని మురళీధర్‌గౌడ్‌ ఒకరని చెప్పొచ్చు. పేద కుటుంబం.. చిరు ప్రభుత్వ ఉద్యోగం. కుటుంబ బాధ్యతల మధ్య ఆయన నటనపై కోరికను అణచి పెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బుల్లి తెర నుంచి పెద్ద తెరకు మారింది. సినీ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగారు. తర్వాత సినీ రంగ ప్రవేశానికి అవకాశం కలిగింది.
మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఐరేని మురళీధర్‌గౌడ్‌ది నిరుపేద వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు రాజమణెమ్మ, గౌరయ్యగౌడ్‌. ప్రాథమిక విద్యాభ్యాసమంతా రామాయంపేటలో జరిగింది. హైస్కూలు గజ్వేల్‌లోనూ, డిగ్రీ సిద్ధిపేటలో చదివారు. 1974లో బిఎ డిగ్రీ పూర్తిచేశారు. తొమ్మిదేళ్లపాటు చిన్నపాటి వ్యాపారాన్ని నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) లో క్లర్కుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 27 సంవత్సరాలు పైగా పనిచేశారు. 2012లో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులో ఉద్యోగ విరమణ పొందారు.
కళారంగంపై ఆసక్తి
చదువుకునే రోజుల్లోనే మురళీధర్‌గౌడ్‌కు నటనంటే ఎంతో ఆసక్తి. ఎక్కడ కళా ప్రదర్శనలు, నాటకాలు, బుర్రకథలు జరిగినా వీక్షించేవారు. నటనలో శిక్షణ తీసుకోలేదు. అయినా పలు నాటకాల్లో ఆర్టిస్టుగా నటించిన సందర్భాలు ఉన్నాయి. సినిమాల వైపు వెళ్తే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో? కుటుంబం రోడ్డున పడుతుందనే భయంతో ఉద్యోగాన్నే నమ్ముకుని పనిచేశారు. ఉద్యోగంలో ఉండగానే నాటకాల్లో నటించేవారు. డైలాగుల డెలీవరీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆయన మరింతగా నటనపై ఆసక్తిని పెంచుకున్నారు.
బుల్లితెర ఎంట్రీతో
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత స్వతహాగా తనకున్న నటనా కౌశల్యంతో బుల్లితెరపై సీరియళ్లలో తండ్రి, అతిథి పాత్రల్లో నటించారు. అప్పటికీ అడపాదడపా వేషాలు మాత్రమే దొరికేవి. ఈ క్రమంలో కొందరు హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆయన నటనను గుర్తించిన కొందరు డైరెక్టర్లు సినిమాల్లో ప్రయత్నించాలని సూచించారు. ఈ క్రమంలో ఆయన సినిమా హీరోల ఆఫీసుల చుట్టూ తిరిగారు. నాలుగేళ్లపాటు ప్రయత్నాలు చేయగా, చిన్నవి మూడు సినిమాలు, ఒక వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ తీసిన పిట్టకథలు చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. అనంతరం ‘డీజే టిల్లు’ చిత్రంలో హీరో సిద్ధు జొన్నలగడ్డకు తండ్రి పాత్రలో నటించారు. ‘బలగం’ చిత్రంలో హీరోయిన్‌ తండ్రి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత ‘దాస్‌ కా ధమ్కీ, మేం ఫేమస్‌, ఫరేషాన్‌, మ్యాడ్‌, భగవంత్‌ కేసరి, కీడాకోలా’ తదితర సినిమాల్లో నటించారు. ‘డిజె టిల్లు (టిల్లు స్క్వేర్‌)’, ‘మంగళవారం’ సినిమాల్లో నటించారు. ‘పుష్ప-2’ సినిమాలోనూ, ఆదికేశవ, విజయదేవరకొండ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కింది.
ప్రతిభావంతుడిగా గుర్తింపు
‘డీజే టిల్లు’లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ తండ్రిగా నటనతో ఆకట్టుకున్నారు. ‘బలగం’ సినిమాలో అలిగిన అల్లుడి పాత్రలో ఏకంగా జీవించేశారు. ఈ సినిమాతో మురళీధర్‌కు అసాధారణంగా పేరు వచ్చింది. మురళీధర్‌గౌడ్‌లో మరో ముఖ్యమైన సుగుణం ఉంది. చక్కటి ఉచ్ఛారణ, డైలాగ్‌ డెలివరీ, సమాయానుగుణమైన మాట తీరుతో మంచి మాడ్యులేషన్‌ ఆయన సొంతం. గతంలో రాళ్లపల్లి, ఎంఎస్‌ నారాయణ, ఎల్‌ నారాయణ వంటివారు తమ నటనతో మెప్పించారు. తనికెళ్ల భరణి కూడా ఏ పాత్రలోనైనా ఒదిగే తత్వం ఉంది. అదే కోవలో మురళీధర్‌గౌడ్‌ తన సినీ ప్రస్థానాన్ని సరికొత్తగా, కళాత్మకంగా కొనసాగిస్తానని చెబుతున్నారు.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️