క్యాలీఫ్లవర్‌ కిచెన్‌

Nov 19,2023 09:46 #Sneha

చుట్టూ ఆకులు, మధ్యలో తెల్లని క్యాలీఫ్లవర్‌ మార్కెట్లోకి విరివిగా వచ్చేశాయి. మరి కాలానికి అనుగుణంగా జిహ్వకి రుచినందించాలి కదా! అయితే చాలా కాలంగా క్యాలీఫ్లవర్‌ని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాం. దాని ఆకులకూ వంటశాలలో ప్రాధాన్యం ఉందని, దానిలోనూ అనేక పోషకాలున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మరి మనమూ క్యాలీఫ్లవర్‌తోనూ, దాని ఆకులతోనూ కొత్త రుచులను తయారు చేసుకుందాం.
ఆకుల చట్నీ..


కావలసినవి : క్యాలీఫ్లవర్‌ ఆకులు- కప్పు, టమోటాలు-3/4 కప్పు, చింతపండు-18 గ్రా., ఎండుమిర్చి -4, ఉప్పు- తగినంత, ఇంగువ- చిటికెడు, లవంగాలు-3, వెల్లుల్లి-4 రెబ్బలు, పసుపు-చిటికెడు, నూనె – టేబుల్‌స్పూన్‌, మినప్పప్పు – ఐదు స్పూన్లు, ఆవాలు – స్పూన్‌, జీలకర్ర -1/2 స్పూన్‌, కరివేపాకు- రెండు రెబ్బలు.
తయారీ : ఆకులను శుభ్రం చేసుకుని తడి లేకుండా ఆరనిచ్చి, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపులా వేపుకుని గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌ మీడియంలో పెట్టి అదే బాండీలో తరిగిన ఆకులు, టమోటా ముక్కలు, వెల్లుల్లి తరుగు వేయాలి. ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించాలి. చల్లారాక జార్‌లో ముందుగా వేయించిన తాలింపు దినుసులను వేసి, బరకగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో తర్వాత ఉడికించిన మిశ్రమాన్ని వేస,ి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొంచెం కాచి చల్లార్చిన నీటిని వాడవచ్చు. ఒక స్పూన్‌ నూనె వేడిచేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టి, అందులో పచ్చడిని కొద్దిసేపు ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే క్యాలీఫ్లవర్‌ ఆకుల చట్నీ రెడీ. ఇది ఫ్రిజ్‌లో పెట్టకుండానే వారం నిల్వ ఉంటుంది.
ఫ్రైడ్‌ రైస్‌..


కావలసినవి : బియ్యం-1/4 కేజీ, క్యాలీఫ్లవర్‌- కప్పు, పెరుగు -1/4 కప్పు, కారం-స్పూను, గరం మసాలా-1/2 స్పూను, వేయించిన జీలకర్ర పొడి-1/2 స్పూను, కరివేపాకు సన్నని తరుగు – ఒక రెబ్బ, నిమ్మరసం- స్పూను, కార్న్‌ఫ్లోర్‌-2 గరిటెలు, గోధుమపిండి -3 గరిటెలు, ఉప్పు- తగినంత, నూనె- తగినంత.
తయారీ : ముందుగా అన్నం పొడిగా వండుకోవాలి. శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్‌ను పువ్వులుగా కట్‌ చేసుకోవాలి. వెడల్పు గిన్నెలో పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, గోధుమపిండి, కార్న్‌ఫ్లోర్‌ అన్నీ నీటితో పలుచగా కలపాలి. ఆ పిండిలో క్యాలీఫ్లవర్‌ పువ్వులు వేసి, కోట్‌ చేసుకోవాలి. స్టౌ లోఫ్లేమ్‌లో ఉంచి, వీటిని నూనెలో ఐదు నిమిషాలు డీప్‌ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టౌ మీడియంలో పెట్టి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేంతవరకూ వేగనివ్వాలి.
బాండీలో మూడు గరిటెల నూనె వేడి చేసి వెల్లుల్లి తరుగు, ఒక ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. వేయించిన క్యాలీఫ్లవర్‌, అన్నం బాండీలో వేసి, స్టౌ హైఫ్లేమ్‌లో పెట్టి వేగంగా తిప్పుతూ నిమిషం పాటు వేయించాలి. దీన్ని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే నోరూరించే క్యాలీఫ్లవర్‌ ఫ్రైడ్‌ రైస్‌ రెడీ. (ఇష్టమైతే ఇతర కూరగాయల ముక్కలు కూడా తాలింపులో వేసుకోవచ్చు)
బ్రెడ్‌..


కావలసినవి : క్యాలీఫ్లవర్‌ – కప్పు, గోధుమ పిండి-2 1/2 కప్పులు, డ్రై ఈస్ట్‌ -2 స్పూన్లు, మరిగే నీరు -11/2 కప్పు, ఉప్పు- స్పూన్‌
తయారీ : ముందుగా ఒక బౌల్‌లో వేడినీటిని తీసుకుని ఈస్ట్‌, ఉప్పు వేసి కరిగించాలి. శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్‌ పువ్వులను పొడిలా మిక్సీ పట్టుకోవాలి.
గిన్నెలో గోధుమ పిండి, క్యాలీఫ్లవర్‌ పొడిని ఈస్ట్‌ కలిపిన నీటితో ముద్దగా కలిపి, తడి వస్త్రం కప్పి, రెండు గంటలు వదిలేయాలి. పిండి ఉబ్బినట్లవుతుంది.
కుక్కర్‌ అడుగున అర అంగుళం మందంలో ఇసుకపోసి సమంగా పరచి విజిల్‌, గాస్‌కట్‌ లేని మూతపెట్టి, పదిహేను నిమిషాలు వేడి చేయాలి. ఇప్పుడు మందపాటి గిన్నె అంచులకు నెయ్యి రాసి, దానిపై గోధుమపిండి కోటింగ్‌లా చల్లాలి. దీనిలో ఈస్ట్‌తో కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని సమంగా పరిచి, కుక్కర్‌లో దాదాపు అరగంట సేపు బేక్‌ చేయాలి. అంతే యమ్మీ యమ్మీగా ఉండే క్యాలీఫ్లవర్‌ బ్రెడ్‌ రెడీ.

➡️