సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

Nov 18,2023 22:17 #Anganwadi Workers

పలు జిల్లాలో అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు
వారి పోరాటం, సమ్మెకు ఐద్వా సంపూర్ణ మద్దతు
ప్రజాశక్తి-యంత్రాంగం:తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు శనివారం ఆందోళనకు దిగారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేపట్టారు. తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదంటూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నంద్యాలలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి సందర్శించి మద్దతు తెలిపారు. విలేకర్లతోనూ మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా జగన్‌మోహన్‌రెడ్డి మోసగించారని విమర్శించారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ముఖ్యంగా మహిళలంతా కలిసి జగన్‌మెహన్‌రెడ్డికి వ్యతిరేకంగా బటన్‌ నొక్కుతారని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరారు. వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, ఫ్రీ స్కూల్‌ను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అనేక రకాల యాప్‌లు పెట్టి నివేదిక పంపించాలని అంగన్‌వాడీలను వేధింపులకు గురిచేస్తోందని, దీనివల్ల పిల్లల సంరక్షణ లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. కృష్ణా జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్త గుండెనొప్పితో చనిపోవడం తాజా ఉదాహరణని తెలిపారు. పసి బిడ్డలకు, గర్భిణులకు, బాలింతలకు సరఫరా చేస్తోన్న పోషకాహారం కల్తీ, పురుగులమయంగా మారిందని విమర్శించారు. గత నెలలో చిత్తూరు జిల్లాలో ఖర్జూరం ప్యాకెట్లో పాము రూపంలో ఉన్న రబ్బర్‌ బ్యాండ్‌ ప్రత్యక్షమై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిందన్నారు. నాణ్యతలేని ఖర్జూరం సరఫరా చేసిన కాంట్రాక్టర్‌ను తొలగించకపోగా నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. నాణ్యతలేని పోషకాహారాన్ని సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై అంగన్‌వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళా సంఘాలు అనేక ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ఫుడ్‌ కమీషనర్‌ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్‌వాడీల సమ్మెకు ఐద్వా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రారంభించారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు నిర్మలమ్మ సందర్శించి మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కేంద్రాల వద్ద అంగన్‌వాడీలు ధర్నా, సామూహిక రిలే నిరాహారదీక్ష చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌ పరిధిలోని చింతూరు, కూనవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాల్లో ర్యాలీ, విఆర్‌.పురంలో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చింతపల్లిలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌కు వినతిపత్రం అందజేశారు.

➡️