మెరిసిన మన్వీర్‌

Nov 17,2023 17:52 #FIFA World Cup, #Foot Ball, #India

కువైట్‌పై 1-0 గోల్స్‌తో భారత్‌ గెలుపు
ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్స్‌ రౌండ్‌-2
కువైట్‌ సిటీ: ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్స్‌ రౌండ్‌ా2లో భారతజట్టు సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆతిథ్య కువైట్‌ జట్టును చిత్తుచేసింది. జబేర్‌ అల్‌-అహ్మద్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-0తో కువైట్‌ను చిత్తుచేసింది. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను మన్వీర్‌ సింగ్‌ 75వ ని.లో చేశాడు. కువైట్‌ ఆటగాడు ఫసల్‌ అల్‌హర్బి రెండు ఎల్లో కార్డులకు గురై మైదానాన్ని వీడడంతో ఆ జట్టు మ్యాచ్‌ ముగిసేవరకు 10మంది ఆటగాళ్లతోనే ఆడింది. భారతజట్టు నవంబర్‌ 21న భువనేశ్వర్‌లో ఆసియా ఛాంపియన్‌ ఖతార్‌తో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. గ్రూప్‌ాఏలో ఉన్న భారత్‌.. ఇదే గ్రూప్‌లో ఉన్న కతార్‌, కువైట్‌, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఒకోక మ్యాచ్‌లో తలపడనుంది. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫిఫా ప్రపంచకప్‌-2026 మూడోరౌండ్‌కు అర్హత సాధించనుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 106వ, కువైట్‌ 149వ ర్యాంక్‌లో ఉన్నాయి. భారతజట్టు కువైట్‌తో ఈ ఏడాది జులైలో జరిగిన సాఫ్‌ ఛాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లో షూటౌట్‌లో విజయం సాధించి టైటిల్‌ నెగ్గిన సంగతి తెలిసిందే.

➡️