గవర్నర్ వెనక్కి పంపిన పది బిల్లులను మళ్లీ ఆమోదించిన అసెంబ్లీ
ప్రజాశక్తి- చెన్నై :బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డంపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విమర్శించారు. శనివారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి, గతంలో తీర్మానించిన 10 బిల్లులను ఏకగ్రీవంగా మరోసారి ఆమోదించారు. బిల్లులపై ఓటింగ్‌కు బిజెపి గైర్హాజరైంది. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ ఆర్.ఎన్ రవి పది బిల్లులను ఇటీవల వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆసెంబ్లీ రెండవసారి ఆమోదించిన బిల్లుల్లో 2020కి సంబంధించి రెండు, 2022కి సంబంధించి ఆరు, ప్రస్తుత సంవత్సరంలో రెండు ఉన్నాయి. ఇందులో వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తొలగించేలా తీసుకొచ్చిన తీర్మానం కూడా ఉంది. వర్శిటీల విసిలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. వ్యవసాయం, ఉన్నత విద్య, న్యాయ వ్యవహారాలకు సంబంధించిన బిల్లులు కూడా వీటిలో ఉన్నాయి.
కారణాలు చూపకుండా బిల్లుల నిలిపివేత అప్రజాస్వామికం : స్టాలిన్
బిల్లులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ఎలాంటి కారణం చూపకుండా బిల్లులను నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే బిల్లులను వెనక్కి పంపారని విమర్శించారు. ఇది అప్రజాస్వామికమని, ప్రజా వ్యతిరేకమని స్టాలిన్ అన్నారు. బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను పెండింగ్‌లో ఉంచడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై నవంబర్ 10న విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 12 బిల్లుల పెండింగ్‌కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిస్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అసెంబ్లీ రెండవసారి ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నరు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.