అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

Oct 21,2024 21:05

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి
– సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు
– మిగిలిన పింఛన్‌ సొమ్ము రూ. 43 లక్షలు రీ కవరీ చేయాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
‘ఈ ఆఫీస్‌లో ఫైళ్లు పంపించడానికి మీకు ఇబ్బంది ఏమిటి? పంపడానికి రాదా..? ఆఫీస్‌కు రండి నేర్పిస్తాను’ అంటూ జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుండి పేపర్‌ రహిత పాలన సాగాలని, అన్ని దాస్తాలు ఈ ఆఫీస్‌లోనే పంపాలని అదేశించారు. తానూ ఆమోదం తెలిపిన ఫైళ్ళకు సంబంధించి ప్రొసీడింగ్‌ ఉత్తర్వులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఉత్తర్వులు జారీ చేయడం ఆలస్యం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో పలు అంశాలపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షా నిర్వహించారు. ఇటీవల సంక్షేమ హాస్టళ్ళకు కలెక్టరేట్‌ నుండి ఫ్యాన్‌లు, ట్యూబ్‌ లైట్‌లను విరాళంగా అందించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖాధికారులపైన కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో హాస్టళ్లలో లైట్లు, ఫ్యాన్‌లు బిగించి తనకు ఫొటోలు పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ‘మీకు ప్రోటోకాల్‌ తెలియదా.? ఉన్న ఇద్దరు ఐఏఎస్‌లకు సమాచారం ఇవ్వరా… ఇలాగైతే కష్టం.. మైండ్‌ సెట్‌ మార్చుకోండి’ అంటూ కొంతమంది జిల్లా అధికారులను కలెక్టర్‌ హెచ్చరించారు. ఇటీవల ఆర్టీసీలో నూతన బస్సు లను ప్రారంభోత్సవంలో ముందస్తు సమాచారం లేకపోవడం పట్ల కలెక్టర్‌ అధికారుల తీరును తప్పు బట్టారు. పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలలో జిల్లా వ్యాప్తంగా సీసీ రోడ్లు, బీటి రోడ్లు, డ్రైన్లకు సంబంధించి 1026 పనులకు శంకుస్థాపన చేశామని వచ్చే ఏడాది జనవరి 15లోగా పూర్తి చేయాలని ఎంపీడీఒలను కలెక్టర్‌ ఆదేశించారు. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని తహశీల్దార్లను, ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకు సంబంధించి రూ. 43 లక్షలు తిరిగి జమ చెయ్యకుండా ఎందుకు ఉన్నారని, అలాంటి అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డిఆర్డిఏ పిడిని కలెక్టర్‌ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌ మాట్లాడుతూ రీ సర్వే చేసిన 173 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సర్వేకు సంబంధించిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఒ ఏ.పద్మజ, స్పెషల్‌ డిప్యూటీ తదితరులు పాల్గొన్నారు.ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి : ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌, డిఆర్‌ఓ ఎ. పద్మజ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు, పాల్గొన్నారు.

➡️