మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్
డిసెంబర్ 9, 10న సిపిఎం జిల్లా మహాసభ
– జయప్రదం చేయండి : జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్
నందికొట్కూరు పట్టణంలో డిసెంబర్ 9, 10వ తేదీలలో జరిగే సిపిఎం జిల్లా 2వ మహాసభను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ కోరారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని జై కిసాన్ పార్క్‌లో సిపిఎం 2వ జిల్లా మహాసభ జయప్రదం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు సభ నాయకులు బెస్తరాజు అధ్యక్షతన కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సిపిఎంగా గత 3 సంవత్సరాలుగా చేసిన ఆందోళన, పోరాటాల ఫలితాలను, ప్రజా ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యచరణ చేయనున్నట్లు తెలిపారు. మహాసభ జయప్రదం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. జిల్లా 2వ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. మూడు సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నాయకత్వాన 29 మండలాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహించామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, సాగునీటి కోసం కృషి, కార్మికుల సంక్షేమం కోసం, కనీస వేతనాలు అమలు చేయాలని అనేక ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికుల కోసం ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పనుల దగ్గర సౌకర్యాల కల్పన కోసం పోరాటాలు చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారాలు వేస్తున్నారని అన్నారు. అనంతరం ఆహ్వాన సంఘం కమిటీని 50 మందితో ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు, యేసురత్నం, జిల్లా కమిటీ సభ్యులు స్వామన్న, రణధీర్, రత్నమయ్య, నరసింహ, శోభ రాణి, నరసింహ నాయక్, ప్రజాసంఘాల నాయకులు పకీర్ సాహెబ్, గోపాలకృష్ణ, రంగమ్మ, శ్రీనివాసులు, ఓబులేసు, దూదేకుల బాబు, జయరాణి, నాగన్న, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఈశ్వరమ్మ, మదార్ బి, నజరునిస్సా, కుషిద్ బి తదితరులు పాల్గొన్నారు.