సమాజ దిక్సూచి ప్రజాశక్తి

Oct 17,2024 22:15

కలర్‌ మిషన్‌ ప్రారంభం అనంతరం మొదటి కాపీని చూపుతున్న అతిథులు

సమాజ దిక్సూచి ప్రజాశక్తి
– ప్రజలు మరింత ఆదరించాలి
– కర్నూలు ఎడిషన్‌ కలర్‌ మిషన్‌ ప్రారంభోత్సవంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏం చేయాలనేది ప్రజాశక్తి చెబుతుందని, ప్రజాశక్తి సమాజానికి దిక్సూచి అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ పేర్కొన్నారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ కేంద్రంలో కలర్‌ మిషన్‌ ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించారు. తొలుత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ రిబ్బన్‌ కట్‌ చేశారు. రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య కలర్‌ మిషన్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రజాశక్తి జనరల్‌ మేనేజర్‌ టి.నరసింహా అధ్యక్షతన నిర్వహించిన సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ మాట్లాడుతూ కలర్‌ పేజీల వల్ల కొంత మంది ఆకర్షితులవుతారన్నారు. ప్రజల పత్రిక ప్రజాశక్తి అని తెలిపారు. ప్రజాశక్తి చదవడం వల్ల ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయంపై అవగాహన వస్తుందన్నారు. ప్రజాశక్తి వ్యాపారం కోసం పెట్టుకున్న పత్రిక కాదని, ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజా ఉద్యమాలకు బాసటగా ఉంటుందని తెలిపారు. ఈ పత్రికను ప్రజలు మరింత ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజా పోరాటాల కరదీపికగా ప్రజాశక్తిని పెట్టుకున్నామని, పత్రికను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, వాస్తవాలను వెలుగులోకి తేవాలని, తప్పులను ఎత్తి చూపాలని తెలిపారు.
పాఠకుల ఆదరణతోనే..- ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీ దాస్‌
ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీ దాస్‌ మాట్లాడుతూ పత్రికను ఆదరిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. ప్రజాశక్తి 1981లో మోటూరు హనుమంతరావు సంపాదకత్వంలో దినపత్రికగా ప్రారంభమైందని, 44 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఒక్క రోజూ ఆగిపోకుండా పత్రికను తీసుకొచ్చామని తెలిపారు. కరోనా సమయంలోనూ సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేశారని, అలాంటి క్లిష్ట సమయంలోనూ పత్రికను తీసుకొచ్చామని, పాఠకుల ఆదరణ మూలంగానే అది సాధ్యమైందని అన్నారు. కర్నూలు, విశాఖ, ఒంగోలులో కలర్‌ మిషన్లను తీసుకొస్తున్నామన్నారు. ప్రతి అక్షరం ప్రజల పక్షం అనే లక్ష్యం కోసం ప్రజాశక్తి పని చేస్తుందన్నారు. మిగతా అన్ని పత్రికలతో వార్తల విషయంలో పోటీ పడతామన్నారు. సిబ్బంది మరింత పట్టుదలతో పని చేయాలని సూచించారు. నిక్కచ్చి కలిగిన వార్తలు- రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్యరవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ వేరే పత్రికల విధానాలకు, ప్రజాశక్తి విధానాలకు తేడా ఉంటుందన్నారు. ప్రజాశక్తిలో నిక్కచ్చి కలిగిన వార్తలు ఉంటాయన్నారు. యువకులు, నిరుద్యోగులకు ఉద్యోగ, పోటీ పరీక్షలకు కావలసిన సమాచారం ప్రజాశక్తిలో దొరుకుతుందన్నారు. సమాజంలో ప్రశ్నించే గొంతుల తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రజాశక్తితో తనకు 20 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. ప్రజాశక్తి లాంటి పత్రికను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిబ్బందికి, విలేకరులకు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
బాధ్యతగా భావించాలి- సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశారు
ప్రజాశక్తిని ముందుకు తీసుకెళ్లడాన్ని అందరూ బాధ్యతగా భావించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశారు తెలిపారు. వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజాశక్తిని ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలని కోరారు. మిగతా పత్రికలు వ్యాపారం కోసం ఉంటే ప్రజాశక్తి ప్రజల కోసం ఉందని గుర్తుచేశారు. పత్రికను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిబ్బంది అకుంటిత దీక్షతో పని చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బతుకన్న మాట్లాడుతూ ఇతర పత్రికలు పెత్తందారుల చేతుల్లో పని చేస్తున్నాయని, ప్రజాశక్తి పెత్తందారుల పక్షం కాదని, ప్రజల పక్షమని తెలిపారు. ప్రజాశక్తి వాస్తమైన వార్తలను ప్రచురిస్తోందన్నారు. ప్రజాశక్తి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టిడిపి నంద్యాల జిల్లా నాయకులు కాతా రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ ఇతర పత్రికలకు ధీటుగా పోటీపడి ప్రజాశక్తి వార్తలను ప్రచురిస్తోందన్నారు. ప్రజాశక్తి ఎప్పుడూ ప్రజల పక్షంగానే ఉంటుందని తెలిపారు. కవి గుంపుల వెంకటేశ్వర్లు ప్రజాశక్తి దినపత్రికపై కవిత చదివి వినిపించారు. ప్రజానాట్య మండలి కళాకారులు సుబ్బరాయుడు, సుంకన్న, సుజాత, ఆశన్నలు అభ్యుదయ, ప్రజాశక్తిపై గేయాలను ఆలపించారు. ప్రజాశక్తి డెస్క్‌ ఇంఛార్జి పి.చంద్రయ్య వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ప్రజాశక్తి ఎడిషన్‌ కమిటీ సభ్యులు ఎం.మంగయ్య, ఎస్‌ఎడి బాషా, ఎం.రాజు, ఎల్లాగౌడ్‌, స్టాఫ్‌ రిపోర్టర్‌ ఎంయు వినరు కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️