పింఛన్ల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోండి

Sep 30,2024 20:31

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

పింఛన్ల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోండి
– ఉపాధ్యాయ అర్హత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
– జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం కింద పింఛన్ల పంపిణీపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లబ్ధిదారులందరికీ మంగళవారం సాయంత్రం లోగా వంద శాతం పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య క్రమంలో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష, స్వర్ణాంధ్ర-2047, ఫ్రీ హోల్డ్‌ భూముల పరిశీలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2.18 లక్షల మందికి పింఛన్లు రూ. 92 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారులు మరణించినా, వలసలు వెళ్లినా సంబంధిత మొత్తాలను గత మూడు నెలల నుంచి తిరిగి జమ చేయలేదని, ఇందుకు సంబంధించిన ఫైల్‌ను తనకు పంపాలని డిఆర్డిఏ పిడిని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 3 నుండి 21 వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 8,800 మంది హాజరవుతున్న నేపథ్యంలో పగడ్బందీగా నిర్వహించాలని ఆర్డిఓ, డిఇఒలకు సూచించారు. ఆర్‌జిఎం, శాంతిరాం, ఎస్‌విఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలలో నిర్వహించే టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, నిరంతర విద్యుత్‌ సరఫరా, పోలీస్‌ బందోబస్తు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వర్ణాంధ్ర- 2047 ప్రణాళికకు రూపకల్పనకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా ప్రజల అభిప్రాయాల సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌ ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను ఆదేశించారు. జెసి సి.విష్ణు చరణ్‌ మాట్లాడుతూ జిల్లాలో 29 వేల ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్‌ భూముల పరిశీలన ప్రారంభించామని, ఎక్కడైతే రిజిస్ట్రేషన్‌ జరిగిందో వాటిని రీ వెరిఫై చేసి నివేదికలను సమర్పించాలని తహశీల్దారులను ఆదేశించారు. మండలంలో భూములను క్రయ విక్రయాలు జరిపినా, మైగ్రేట్‌ చేసినా వాటిని పరిశీలించా లన్నారు. భూముల ప్రతి లావాదేవీలు క్లియర్‌గా ఉండాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఒ పద్మజ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️