ఆర్‌టిసి బస్సుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌

Sep 22,2024 20:31

ఆర్‌టిసి ఆర్‌ఎం రజియా సుల్తానా

ఆర్‌టిసి బస్సుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌
– మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తే కఠిన చర్యలు
– మారుమూల ప్రాంతాలకూ ఆర్‌టిసి సర్వీసులు
– ప్రజాశక్తితో ఆర్‌టిసి ఆర్‌ఎం రజియా సుల్తానా ముఖాముఖి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
‘ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణికులు టికెట్‌ తీసుకోవడానికి నగదుతో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మూరుమూల గ్రామాలకు సైతం ఆర్‌టిసి సేవలు అందించాలనే లక్ష్యంగా అవసరమైన ప్రతి ప్రాంతానికి బస్సు సర్వీసులు కొనసాగిస్తున్నాం. ఆర్‌టిసి ప్రయాణం సురక్షితం.. ఆటోలలో అధిక లోడుతో ప్రయాణం చేయడం మంచిది కాదు. కాబట్టి ప్రజలు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్‌టిసి బస్సు డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసినా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా నంద్యాల నుండి అరుణాచలంకు ఒక సర్వీస్‌ ను తిప్పుతున్నాం’ అని ఆర్‌టిసి నంద్యాల రీజినల్‌ మేనేజర్‌ రజియా సుల్తానా తెలిపారు. ప్రయాణికులకు ఆర్‌టిసి అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై ఆమె ప్రజాశక్తితో ముఖాముఖీ మాట్లాడారు. మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..
జిల్లాలో ఎన్ని ఆర్‌టిసి డిపోలు ఉన్నాయి..?
ఆర్‌ఎం : నంద్యాల జిల్లాలో 7 డిపోల ద్వారా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అందులో సూపర్‌ లగ్జరీ సర్వీసులు 70 బస్సులు. మిగిలినవి ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు సర్వీస్‌ల కింద నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో 7 డిపోల్లో 17 బస్సులు కొత్తవి వచ్చాయి.
జిల్లాలో ఎంత మంది డ్రైవర్లు, కండక్టర్‌లు పని చేస్తున్నారు..?
ఆర్‌ఎం : జిల్లాలో ప్రస్తుతం డ్రైవర్లు 621 మంది, కండక్టర్‌లు 706 మంది ఆర్‌టిసిలో పని చేస్తున్నారు.
డ్రైవర్లకు, కండక్టర్‌లకు శాఖ పరంగా ప్రోత్సాహకాలు ఏమైనా ఇస్తున్నారా..? వారిని ప్రోత్సహించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఆర్‌ఎం : జిల్లాలో డ్రైవర్లను, కండక్టర్లను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కెఎంపిఎల్‌ తెచ్చిన వారికి, డీజిల్‌ పొదుపు చేసిన వారికి క్యాష్‌ అవార్డులు ఉంటాయి.. అలాగే ప్రయాణికులను ఎక్కిస్తూ ఎక్కువ టికెట్లు తెచ్చిన కండక్టర్‌లకు ఉత్తమ అవార్డు, ప్రశంసాపత్రంతో పాటు ఘనంగా సన్మానించడం లాంటివి చర్యలు చేపడుతున్నాం. ఈ పక్రియలో నంద్యాల-కర్నూలు రూట్‌లో నలుగురికి ఇచ్చాం.
ఆర్‌టిసి బస్సుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌కు అవకాశం ఉందా..?
ఆర్‌ఎం : బస్సుల్లో టికెట్‌ తీసుకోవడానికి నగదుతో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్‌ సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నాం. ఒక వేళ ఆన్‌లైన్‌లో సమస్య వచ్చినప్పుడు ఆ అమౌంట్‌ ప్రయాణికులకు తిరిగి వారి ఖాతాల్లోకి జమ అవుతుంది.
ఆర్‌టిసి బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో తినుబండరాలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. వీటిపై మీ స్పందన ఏమిటి..?
ఆర్‌ఎం : ఆర్టీసీ బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లలో తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఎంఆర్‌పి రేట్లకే అమ్మాలని యజమానులను హెచ్చరించాం. అలానే కొనసాగితే అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే షాప్‌లను క్లోజ్‌ చేయిస్తాం.
ఆర్‌టిసి డిపోల పరిధిలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటి డెవలప్‌మెంట్‌కు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా..?
ఆర్‌ఎం : జిల్లాలోని పలు ఆర్‌టిసి డిపోలలోని ఖాళీ స్థలాలను గుర్తించాం. వాటిని లీజుకు ఇచ్చి ఆర్టీసీ డిపోలకు ఆదాయం వచ్చేలా చూస్తున్నాం. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, కోవెలకుంట్లలో 15 ఏళ్లకు లీజుకు ఖాళీ స్థలాలను ఇచ్చాం.
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం అమలు చేస్తున్నారా..?
ఆర్‌ఎం : ఆర్‌టిసి డిపోలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం.
ఆర్‌టిసి డిపోల్లో తగినంత సిబ్బంది ఉన్నారా..?
ఆర్‌ఎం : ఆర్‌టిసి డిపోలల్లో సిబ్బంది ఉన్నారు. సూపవైజర్ల క్యాడర్‌లో విరమణ పొంది ఖాళీ అయిన స్థానాల్లో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తున్నాం..
నంద్యాల-నందికొట్కూరు రూట్‌లో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిపే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా..?
ఆర్‌ఎం : ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. నంద్యాల, నందికొట్కూరు రూట్‌లో ఎక్కువగా స్టేజీలు ఉన్నాయి. ప్రజలు పల్లెవెలుగు బస్సులనే కోరుకుంటున్నారు. ఎక్సప్రెస్‌లకు స్పందన కనపడటం లేదు. అయినా ప్రయాణికుల కోసం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.
ఆర్‌టిసిలో కారుణ్య నియామకాలు చేపడుతున్నారా..?
ఆర్‌ఎం : కారుణ్య నియామకాల కింద అర్హత ఉన్న వారితో పోస్టులను భర్తీ చేశాం. 2019 సంవత్సరం నుండి పక్రియ ఆగిపోయింది. మళ్లీ భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తాం.

➡️