రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం

Sep 22,2024 20:24

హంద్రీనీవా ఎత్తిపోతల వద్ద జలహారతి ఇస్తున్న మంత్రి నిమ్మల

రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం
– ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్‌
హంద్రీనీవా ప్రధాన కాలువ నుండి సాగునీటి కాలువల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందించి రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించి జలహారతి ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌టిఆర్‌ కలలు గన్నట్లు రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని, ఆసియాలోనే అతి పెద్ద, పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టిడిపిదేనని అన్నారు. 3850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని అన్నారు. జగన్‌ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడిపోయాయని, ప్రాజెక్ట్‌ సామర్థ్యం 40 టిఎంసిలు అయితే కనీసం 20 టిఎంసిల నీటిని కూడా రాయలసీమకు అందించలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్ది, హంద్రీనీవాను పూర్తి స్థాయులో వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. టిడిపి ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువల పనులు 90 శాతం పూర్తి చేస్తే జగన్‌ మిగిలిన 10 శాతం పూర్తి చేయలేదన్నారు. నెలలో రెండు సార్లు రాయలసీమలో పర్యటించి సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామనితెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పత్తికొండ ఎమ్మెల్యే కెఇ.శ్యాంబాబు, అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రికి వినతి : మండల పరిధిలోని నాగటూరు ఫేస్‌-1,2 లిఫ్ట్‌కు మరమ్మతుల కోసం నిధులు కేటాయించి ఆదుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రైతు సంఘం తాలూకా కమిటీ కార్యదర్శి రాజు, రైతులు వెంకట నాగ శేషులు, బాలస్వామి, జ్ఞానేశ్వరరావు, శేఖర్‌, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️