అపరిశుభ్రంగా గ్రామాలు

Sep 15,2024 21:48

చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల గ్రామాల్లో ప్రధాన రహదారులపైనే ప్రవహిస్తున్న మురుగునీరు

అపరిశుభ్రంగా గ్రామాలు
– మురుగునీటిలో దోమలు వృద్ధి
– రోగాల బారిన ప్రజలు
– పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి – కోవెలకుంట్ల
కోవెలకుంట్ల మండలంలోనిగ్రామాల్లో అపరిశుభ్రత తాండవం చేస్తోంది. మండల ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయి. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆశయంతో స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా గ్రామాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి మురుగునీరంతా ప్రధాన రోడ్లపైకి చేరి అపరిశుభ్రంగా మారుతున్నాయి. మండలంలోని చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, వల్లంపాడు, లింగాల గ్రామాలలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో దారులు అపరిశుభ్రంగా మారాయి. ప్రధాన రహదారిలో, గ్రామాల్లోని వీధులలో మురుగునీరు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగునీటిలో దోమలు వృద్ధి చెందుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికన్‌గున్యా తదితర విష జ్వరాల బారిన పడుతున్నారు. రహదారిపై ప్రవహించే మరుగునీటిలో చిన్నపిల్లలు, ముసలివారు జారి కింద పడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వీధులలో డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో సిసి రోడ్లపైనే మురుగునీరు పారుతుంది. ఆయా గ్రామాల్లో పంచాయతీ అధికారులు మరుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్న తీరును గమనిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయి నీరు రోడ్లపైనే పారుతుందని స్థానికులు చెబుతున్నారు. పొలం పనులకు, కూలి పనులకు వెళ్లి వచ్చిన రైతులు, మహిళలు సాయంత్రం ఇంటి బయట కొద్దిసేపు కూర్చుందామంటే దోమల తాకిడికి తట్టుకోలేకపోతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి, సిసి రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా చర్యలు చేపట్టాలని, డ్రైనేజీ కాలువలు లేని చోట ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తాజా వార్తలు

➡️