గుంతలమయంగా రహదారులు

Sep 15,2024 21:45

గుంతలు పడిన రహదారి

గుంతలమయంగా రహదారులు
– ప్రతి సమావేశంలోనూ నిధులు వచ్చాయంటున్న అధికారులు
– సంవత్సరాలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టని వైనం
– తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు
ప్రజాశక్తి – రుద్రవరం
రుద్రవరం మండలంలోని ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. అడుగుకో గుంత పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చిన్నకంబలూరు మెట్ట నుండి సిరివెళ్ల మధ్య వరకు, రుద్రవరం నుండి నరసాపురం, గుర్రప్పమాను మెట్ట నుండి చందలూరు వరకు రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఈ ప్రధాన రహదారుల్లో ప్రయాణం సాగించాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రుద్రవరం మండల పరిధిలోని గురుప్పమాను మెట్ట నుండి చందలూరు వరకు 6 కిలోమీటర్లు, నాగిరెడ్డిపల్లె మెట్ట నుండి పేరూరు మీదుగా ఎర్రగుంట్ల వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మండల కేంద్రమైన రుద్రవరం చేరుకోవాలన్నా, అలాగే రుద్రవరం నుండి ఆళ్లగడ్డకు పనుల నిమిత్తం వెళ్లాలన్నా ఈ ప్రధాన రహదారిలోనే ప్రయాణం సాగించాలి. 15 నిమిషాల నుండి 20 నిమిషాలు పట్టే ప్రయాణం గుంతలమయమైన ఈ రహదారిపై దాదాపు గంట పైనే పడుతుందని, నరకయాతన అనుభవిస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలగే మండల కేంద్రమైన రుద్రవరం నుండి చిన్నకంబలూరు, సిరివెళ్ల మార్గమధ్య వరకు 4 కిలోమీటర్లు, రుద్రవరం నుండి నరసాపురం మార్గమధ్య వరకు 8 కిలోమీటర్లు ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారి మొత్తం కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ గ్రామాల పరిధిలోని రైతులు, వ్యవసాయ కూలీలు పంట పొలాలకు వెళ్లడానికి గుంతలు ఏర్పడ్డ రహదారుల్లో ప్రయాణం సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారులు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా అటు పాలకులు గానీ, ఇటు సంబంధిత అధికారులు గానీ పట్టించుకున్న పాపానా పోలేదని ప్రయాణికులు, వాహనదారులు, ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో రహదారుల్లో ఏర్పడిన గుంతల్లో నీరు నిలువ చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి. రహదారిపై ఉండే గుంత కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. రహదారుల మరమ్మతులు చేపట్టాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు ఏర్పడిన రహదారుల్లో ప్రయాణం సాగించి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులకు గానీ, అధికారులకు చీమకుట్టినట్లైనా అనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారుల్లో పాలకులు, జిల్లా అధికారులు ప్రయాణం సాగిస్తున్నా చూసీ చూడనట్లే వెళ్ళిపోతున్నారు తప్ప దృష్టి సారించి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం జరగకుండా, ప్రమాదాలు చోటు చేసుకోకుండా చేపట్టాలన్న ఆలోచన వారికి తట్టడం లేదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మండలంలో సమావేశాలు, సభలు నిర్వహించిన సందర్భాలలో పాలకులు ఈ రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు చేపడతారని మాటలు చెబుతున్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయే తప్ప రహదారుల మరమ్మతులు చేపట్టే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు స్పందించి ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారుల మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు, ఆయా గ్రామాల రైతులు, కూలీలు కోరుతున్నారు.

తాజా వార్తలు

➡️