సస్పెండ్ అయిన ఈఓఆర్డి శివరామయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి ఖలీల్ భాష (ఫైల్ ఫోటోలు)
ఇద్దరు అధికారులు సస్పెండ్
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్/బనగానపల్లె
బనగానపల్లె మండలం కుడా పరిధిలోని లేఔట్ల భవన నిర్మాణాలను నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు మంజూరు చేసిన ఈవోఆర్డి ఎ.శివ రామయ్య, కైప గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.ఖలీల్ బాషాలను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మైలవరపు కష్ణ తేజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.ఖలీల్ బాషా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అక్రమ లేఔట్లకు నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇవ్వడం, బిల్డింగ్ ఫండ్ ఛార్జీలు, భవనాల నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడంలోరూ. 23.56 లక్షలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇఒఆర్డిగా ఉన్న ఎ.శివరామయ్య గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పట్టించుకోకపోవడంతో ఆయనను కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఇఒఆర్డి శివరామయ్య మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది తెలిపారు.