స్వర్ణకారి.. అణగారి…

Sep 10,2024 20:46

నగల తయారీలో నిమగమైన స్వర్ణకారుడు

స్వర్ణకారి.. అణగారి…
– రెడీమేడ్‌ ఆభరణాలపై మక్కువ
– కార్పొరేట్‌ సంస్థల రాకతో కరువైన పనులు
– ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులు
ప్రజాశక్తి – చాగలమర్రి
మగువలు మెచ్చిన రీతిలో రెడీమేడ్‌ ఆభరణాలు లభ్యం.. ఆధునాతన యంత్రాలు.. కార్పోరేట్‌ సంస్థల రాక… పాత నగలు, కొత్తనగలతో మార్పిడితో స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయి. ఫలితంగా స్వర్ణకారులకు జీవనోపాధి కరువైంది. కుల వృత్తిని వదులుకోలేక కొందరు అదే వృత్తిలో కొనసాగుతూ కునారిల్లుతున్నారు. మరి కొందరు వలస కార్మికులుగా మారుతున్నారు.
ఒకప్పుడు స్వర్ణకారులకు చేతినిండా పని ఉండేది. నేడు ఆ వృత్తి దాదాపు కనుమరుగవుతోంది. ఒకప్పుడు బంగారు ఆభరణాలు చేయించాలనుకుంటే వెంటనే స్వర్ణకారులను సంప్రదించేవారు. స్వర్ణకారులే గ్రామాల్లో ఇంటికి వచ్చి మరి బంగారు ఆభరణాలను తీసుకెళ్లి మెరుగు పెట్టి, లేదా కొత్త నగలను తయారు చేసి తెచ్చి ఇచ్చేవారు. పెళ్లిళ్ల సమయంలో సంబంధిత వ్యక్తుల ఇంట్లో కుంపటి పెట్టి మంగళ సూత్రం మొదలు నగలన్నీ తయారు చేసి ఇచ్చేవారు. దీంతో అప్పట్లో పెళ్లిళ్ల సీజన్లో తీరిక లేకుండా పనులుండేవి. కాని నేడు ఆ పరిస్థితి మారిపోయింది. అన్నీ ఆభరణాలు రెడీమేడ్‌గా లభిస్తుండడంతో స్వర్ణకారుల వద్ద నగలు చేయించుకునేవారే కరువయ్యారు. దీంతో పనుల లేక స్వర్ణకారులు పూట గడవని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చాగలమర్రి మండలంలో 20 ఏళ్ల క్రితం సుమారు 200 స్వర్ణకారుల కుటుంబాలు ఉండేవి. నేడు పట్టుమని 20 కుటుంబాలు కూడా బంగారు ఆభరణాల తయారీ పని చేయడంలో లేరు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు స్వర్ణకారులు ఉండే వారని చరిత్రలో చెప్పుకోవాల్సి వస్తుంది.ఇతర వృత్తుల్లోకి వలస : పనులు లేక స్వర్ణకారులు సొంత ఊరిలో వేరే పనిచేయలేక మరో ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ ఇతర వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొందరు బ్యాంకుల్లో అప్రెజర్లుగా పని చేస్తున్నారు. అందరికీ ఆ పనులు దొరక్క ఆటో డ్రైవర్లుగా, హోటళ్లల్లో, తోపుడు బండ్లపై వ్యాపారం, వాచ్‌మెన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు.ఆదుకోని ఆదరణ : కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదరణ పథకం స్వర్ణకారులను ఆదుకోలేకపోతుంది. రుణాలు, పనిముట్లు అందడం లేదు. స్వర్ణకారుల కోసం ప్రభుత్వం ఓ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి వారితో నగలు తయారు చేయించి ఆ కళను ప్రోత్సహిస్తే తప్ప వారికి జీవనోపాధి లభించే పరిస్థితి లేదు.
ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్లో తీరిక ఉండేది కాదు : షఫి, చాగలమర్రి.
ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే మాకు తీరిక ఉండేదికాదు. వివిధ రకాల డిజైన్లతో నగలు తయారు చేయించుకునేవారు. ప్రస్తుతం పరిస్ధితి మారింది. మార్కెట్‌లోకి రెడీమేడ్‌ ఆభరణాలు రావడంతో మాకు పనులు లేకుండా పోతున్నాయి.
రెడీమేడ్‌ దెబ్బ మాపై పడింది : మహబూబ్‌ బాషా, చాగలమర్రి.
పెళ్లిళ్లకు రెడీమేడ్‌ ఆభరణాలు కోనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా స్వర్ణకారులకు పని దొరకడం గగనంగా మారింది. గత కొన్నెళ్లుగా అరకొర పనులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం.

తాజా వార్తలు

➡️