కుందూ నది పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి ఎన్‌ఎండి ఫరూక్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్
– కుందూ నది పరివాహక ప్రాంతాలను పరిశీలన
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ సూచించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని 1వ వార్డు హరిజనవాడలో మద్దిలేరు వాగును వద్ద వరద ఉధృతిని, కుందూనది పరివాహక ప్రాంతాలను మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు సూచనలు చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో అవసరమైన ఆహారం, తాగునీరు సరఫరా గురించి మంత్రి అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లపై అడ్డంగా చెట్లు పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందా అని సమాచారం తెలుసుకున్నారు. చేపలు పట్టేందుకు మత్స్యకారులు కుందూనది పరివాహ ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మంత్రి కార్యాలయానికి అందజేయాలని, ఏదైనా ప్రజలకు అవసరం ఉంటే వెంటనే వారి సమస్యను పరిష్కరించాలన్నారు. పోలీస్ సిబ్బంది అలర్ట్‌గా ఉండాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్, 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, మిద్దె చిన్న ఉసేని, బింగుమళ్ల శ్యాంసుందర్, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.