ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి బి.రమణ మట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలోను, సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించడంలోను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా కార్మికుల చెస్ ద్వారా బోర్డులో ఉన్న రూ.2000 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించి సంక్షేమానికి తూట్లు పొడిచిందన్నారు. జీవో 12,13ను విడుదల చేసి పని లేకుండా చేసిందన్నారు. తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అమలు చేయకపోవడం దారుణమన్నారు. సంక్షేమ బోర్డు ను సమర్థ వంతంగా నిర్వహించాలని, ఉపాధికి నష్టం చేసే మెమో 12,13 లను రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సంఘం అధ్యక్షులు కంది త్రినాధరావు, రాజు, బి.గోపాల్, జనార్ధన్, పైడినాయుడు, కార్మికులకు మద్దతుగా ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.