లండన్ : లండన్‌లో భారత విద్యార్థి మిత్‌కుమార్ పటేల్ (23) మృతి చెందాడు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. మిత్ కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉన్నత చదువుల కోసం లండన్‌కి వెళ్లాడు. రెండు నెలల అనంతరం నవంబర్ 17వ తేదీన మిత్‌కుమార్ అదృశ్యమయ్యాడు. దీంతో బంధువుల ఫిర్యాదుమేరకు అతనిపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగురోజులకు నవంబర్ 21వ తేదీన తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలో థేమ్స్ నదిలో పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించారు. అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు బయటకు తీశారు. అయితే మిత్‌కుమార్ మృతికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. కాగా, మిత్‌కుమార్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు గో ఫండ్ మీ అనే ఆన్లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధులను సేకరణ ప్రారంభించినట్లు తన బంధువు పార్థ్పటేల్ తెలిపాడు. ఒక్క వారం వ్యవధిలోనే జీబీపీ (గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి (భారత కరెన్సీలో 4 లక్షల 76 వేలు) పైగా వచ్చాయని పటేల్ అన్నారు.
‘ఉన్నత చదువుల కోసం మిత్‌కుమార్ సెప్టెంబర్‌లో లండన్‌కి వచ్చాడు. షెఫీల్డ్ హాలం విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సు చదవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ అమెజాన్‌లో అతనికి పార్ట్‌టైం జాబ్ కూడా వచ్చింది. నవంబర్ 17వ తేదీ డైలీ వాక్‌కి వెళ్లిన మిత్.. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. మాకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంతలోనే చనిపోవడం బాధకు గురిచేస్తుంది. సేకరించిన డబ్బుల్ని అతని కుటుంబానికి అందజేస్తాం. మృతదేహాన్ని భారత్‌కి పంపిస్తాం.’ అని పార్థ్పటేల్ అన్నారు.