న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యతలు (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌్) చాలా పేలవంగా నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) శనివారం తెలిపింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, అశోక్ విహార్ ప్రాంతాల్లో ఎక్యూఐ స్థాయిలు బాగా క్షీణించాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఆనంద్ విహార్ 388, అశోక్ విహార్ 386 ఎక్యూఐ రికార్డు నమోదయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాగా, శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఆనంద్ విహార్, అశోక్ విహార్ ప్రాంతాల్లో 412, 405 ఎక్యూఐ రికార్డు నమోదైంది. అయితే నిన్నటి కంటే.. ఈరోజుకి ఎక్యూఐలు మెరుగుపడినట్లు సిపిసిబి పేర్కొంది. ఇక ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం వల్ల ఢిల్లీవాసులు శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అక్కడ స్థానికుడు అభిషేక్ తెలిపారు.