‘ చైనా ఇన్‌ఫెక్షన్‌ ‘తో ఎలాంటి సంబంధం లేదు : అమెరికా అధికారులు

అమెరికా : చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులన్నీ శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని డబ్ల్యుహెచ్‌ఒ నిర్థారించింది. అందుకు కావల్సిన పూర్తి సమాచారాన్ని చైనా డబ్ల్యుహెచ్‌ఒకు అందజేసింది. మరోవైపు … అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆందోళన చెందిన అగ్రరాజ్య సెనెటర్లు ” మాకు మరింత సమాచారం తెలిసే వరకు… చైనాపై ప్రయాణ నిషేధం విధించాలి ” అంటూ .. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కోరారు. అయితే యుఎస్‌ సెనెటర్ల ఆందోళనపై అమెరికా అధికారులు స్పష్టతనిచ్చారు.

అమెరికాలో పెరుగుతున్న కొత్తరకం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు …

అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు అలాబామా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, మిస్సిస్సిపీ, న్యూ మెక్సికో, ప్యూర్టోరికో, టెక్సాస్‌ సహా 11 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదైనట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా 3 సంవత్సరాల నుండి 8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్‌ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తాయి. అయితే చైనాలో పెరిగిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు ఈ కొత్త వ్యాధికారకంతో ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు.

అసాధారణంగా ఏమీ కనిపించలేదు : అమెరికా అధికారి

చైనాలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని బైడెన్‌ పరిపాలనలోని ఒక అధికారి తెలిపారు. ”మేము కాలానుగుణ పోకడలను చూస్తున్నాము. అసాధారణంగా ఏమీ కనిపించడం లేదు. ఈ సమయంలో, యుఎస్‌ అత్యవసర విభాగాలలో సంరక్షణను కోరుకునే వ్యక్తులకు, చైనాలో శ్వాసకోశ అనారోగ్యం వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్లు ఎలాంటి సూచన లేదు, ”అని అధికారి తెలిపారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఓ ప్రకటన…

తమ దేశంలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులపై చైనా కూడా ఇటీవల స్పందించింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఓ మీడియాతో అన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు తాము అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

డబ్ల్యుహెచ్‌ఒ నిర్థారణ…

ప్రోగ్రాం ఫర్‌ మానిటరింగ్‌ ఎమర్జింగ్‌ డిసీజెస్‌ ద్వారా పిల్లలలో గుర్తించబడని న్యుమోనియా సమూహాలపై నివేదికను ఉటంకిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా నుండి అదనపు సమాచారాన్ని డబ్ల్యుహెచ్‌ఒ కోరింది. చైనా పూర్తి వివరణ ఇవ్వడంతో అవి శీతాకాలంలో వచ్చే సీజనల్‌ సమస్యలేనని డబ్ల్యుహెచ్‌ఒ నిర్థారించింది.

దురుద్దేశంతో కట్టుకథలు : చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి

వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు మాట్లాడుతూ … సెనేటర్‌ల వాదనలను ”దురద్దేశంతో కూడిన కట్టుకథలు” అని చెప్పారు. యుఎస్‌ – చైనాల మధ్య విమాన కార్యకలాపాలు…యుఎస్‌, చైనా రెండు దేశాల మధ్య విమాన కార్యకలాపాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ 2019 స్థాయి కంటే తక్కువగానే ప్రయాణాలున్నాయి. ముఖ్యంగా, ఆమోదించబడిన విమానాల సంఖ్య నవంబర్‌ 9న ప్రతి దేశానికి వారానికి 35కి పెరిగింది.

➡️